త్వరలో రూ.1000 నోట్లు..?
న్యూఢిల్లీ: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలోనే కొత్త రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనుందట. ఇప్పటికే చరిత్రలో తొలిసారి కొత్త రూ. 200 నోట్లను జారీచేసిన ఆర్బీఐ త్వరలోనే ఈ కొత్త నోట్లను జారీ చేయనుంది. తాజా నివేదిక ప్రకారం 2017, డిసెంబర్ నాటికి కొత్త రూ. 1000 నోట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.200, రూ. 500, రూ.2,000ల మధ్య ఉన్న ఖాళీని పూరించడానికి రూ.1,000 నోటును తిరిగి తీసుకురానున్నట్టు సమాచారం.
మెరుగైన భద్రతా లక్షణాలు, కొత్త డిజైన్తో రూ.1000 కరెన్సీ నోట్లను లాంచ్ చేయనుంది. డీఎన్ఏ మనీ రిపోర్టు ప్రకారం మైసూర్, సల్బోనిలో ప్రింటింగ్ ప్రెస్ ప్రింటర్లు కొత్తగా రూ.1,000 నోట్లను ముద్రించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 2017 నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయని నివేదించింది.
అయితే తాజా అంచనాలు కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ముందు చెప్పినదానికి విరుద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ రూ.1000 రూపాయలను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కాగా తక్కువ విలువ కలిగిన కరెన్సీలు లేకపోవడంతో కేంద్ర బ్యాంకు ఆగస్ట్ 25న కొత్త రూ.200, రూ 50నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.