3 నుంచి ఆలిండియా చెస్ టోర్నీ
హైదరాబాద్: గచ్చిబౌలిలోని నిథమ్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్, నిథమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్–2017 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 3 నుంచి 8 వరకు జరిగే ఈ టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను నిథమ్ ప్రాంగణంలో బుధవారం నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చిన్నం రెడ్డి, ప్రిన్సిపల్ నరేందర్ కుమార్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ ఫయాజ్‌ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు ఈ నెల 25వ తేదీలోపు రూ.5 వేలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. కాగా రూ. 500 అదనపు రుసుముతో ఆగస్టు 1వ తేదీ వరకు కూడా తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఆసక్తి గలవారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి 8885817666, 9866702431 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. రూ. 10 లక్షల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టాప్–20 స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేస్తారు. ఈ సందర్భంగా నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చిన్నంరెడ్డి మాట్లాడుతూ చదువు, శిక్షణలతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలనే తపనతో మొదటి నిథమ్ ఆలిండియా ఓపెన్ చెస్ టోర్నీని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి వయో పరిమితి లేకుండా అందరూ పాల్గొనేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని , చెస్ క్రీడాకారులంతా ఈ టోర్నీలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నిథమ్ అ«ధ్యాపకులు, టీఎస్‌సీఏ ప్రతినిధులు పాల్గొన్నారు.