అవసరానికి అప్పిచ్చేవారేరి..?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో మూడేళ్లుగా మైక్రోఫైనాన్స్ కంపెనీల కార్యకలాపాలు లేనే లేవు. కొత్త రుణాల ఊసే లేదు. పాత రుణాలైతే రూ.7,000 కోట్ల మేర పేరుకుపోయి ఉన్నాయి. వాటి వసూలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి దీని ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతోంది? దీనివల్ల జరిగిందేంటి?
సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్... (ఎంఎఫ్ఐఎన్) సీఈఓ అలోక్ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే... ‘‘దీనివల్ల బాగా నష్టపోతున్నది జనమే. రుణాల అవసరం ఉన్నవాళ్లే. ఎందుకంటే ఏటా సూక్ష్మ రుణ సంస్థలిచ్చిన వేల కోట్ల రూపాయల రుణాల్ని ఇప్పుడు ఎవ్వరూ ఇవ్వటం లేదు. ఆ లోటును ఇతర రుణ సంస్థలు గానీ, ప్రభుత్వం గానీ భర్తీ చేయలేదు. దీంతో గ్రామాల్లో ప్రధానంగా రుణం కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. వీటన్నిటితో పాటు సూక్ష్మ రుణాలు లభ్యం కాకపోవటం వల్ల ఆయా వర్గాల్లో వినిమయ శక్తి దాదాపు 19 శాతం పడిపోయింది. ఇది మేం చెబుతున్న మాట కాదు. ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్‌కు చెందిన ఇద్దరు చేసిన అధ్యయన ఫలితం. ఆర్బీఐ మద్దతుతో నడుస్తున్న ఈ సంస్థ అధ్యయనం రాష్ట్రంలో సూక్ష్మ రుణాలకు సంబంధించి అనేక కోణాల్ని బయటపెట్టింది’’ అని. స్వీయ నియంత్రిత సంస్థలకు (ఎస్ఆర్ఓ) ఉండాల్సిన మార్గదర్శకాలను ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నేపథ్యంలో ఎంఎఫ్ఐఎన్ కూడా ఆ కేటగిరీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికనుగుణంగా బైలాస్‌లో తగు మార్పులు చేసేందుకు మంగళవారమిక్కడ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీన్ని పురస్కరించుకుని సోమవారం అలోక్ ప్రసాద్ విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.
మిగిలిన రాష్ట్రాల్లో భేష్
ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో సూక్ష్మ రుణాలు వేగంగా పెరుగుతున్నాయని, 2012-13తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల పెరుగుదల 50-55 శాతంగా ఉందని ప్రసాద్ చెప్పారు. రికవరీ రేటు కూడా 99 శాతాన్ని మించి ఉందన్నారు. ‘‘రుణదాత-రుణగ్రహీత మధ్య సంబంధం బావుందనటానికి ఈ రీపేమెంట్ శాతమే గట్టి నిదర్శనం. మైక్రోఫైనాన్స్ బిల్లును పార్లమెంటరీ స్థాయీసంఘం అన్ని పరీక్షలూ చేసి ఓకే చేసింది. అయితే ఎన్నికల కారణంగా ఈ పార్లమెంటులో అది ఆమోదం పొందకపోవచ్చు. కానీ అన్ని పార్టీలూ దీనికి మద్దతిస్తున్నాయి’’ అని తెలియజేశారు. ఎంఎఫ్ఐలు జాతీయ వినియోగ బ్యాంకులుగా మారుతాయని నచికేత్ మోర్ కమిటీ పేర్కొందంటూ... దీన్నిబట్టి రుణ వితరణలో ఎంఎఫ్‌ఐల ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల పరిధిలో కొన్ని రుణ వసూళ్లు జరిగాయి. ఆ సందర్భంగా తెలిసిందేంటంటే రుణ గ్రహీతలు ఎంఎఫ్‌ఐల కార్యకలాపాలను గట్టిగా కోరుకుంటున్నారు’’ అని చెప్పారు.
క్రెడిట్ బ్యూరోల పరిధిలో...
ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో 2010 నుంచీ ఎంఎఫ్‌ఐల కార్యకలాపాలు పూర్తిగా మారిపోయాయని అలోక్ చెప్పారు. ‘‘ఎంఎఫ్ఐ రుణాలు తీసుకుంటున్న వారి వివరాలన్నిటినీ రెండు క్రెడిట్ బ్యూరోలు నమోదు చేస్తున్నాయి. ఈ వివరాలు వారానికోసారి అప్డేట్ అవుతాయి. దీనివల్ల ఒకే వ్యక్తి ఎక్కువ లోన్లు తీసుకోవటం వంటివి ఉండవు. ఆ వ్యక్తి రుణ చరిత్ర కూడా కంపెనీకి ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటికి 12 కోట్ల రుణ రికార్డులు వీటివద్ద నమోదయ్యాయి’’ అని వివరించారు. దేశంలో సూక్ష్మ రుణాలకు ఏటా రూ.12 లక్షల కోట్ల మేర డిమాండ్ ఉందని, కానీ దీన్ని ప్రస్తుత సంస్థలు తీర్చలేకపోతున్నాయని చెప్పారు.