ఉగాది ఉత్సవాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం: ప్రజల ఇలవేల్పు, వరాలిచ్చే దేవత బలుసులమ్మ ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రజక ఆసాదులతో గరగల సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం గోదావరి ఏలూరు కాలువ వద్ద ఉన్న పెద్ద శివాలయం వద్ద నుంచి గరగలను బలుసులమ్మ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఆలయం వద్ద డాక్టర్ శశి కుమార్, డాక్టర్ శైలజ దంపతులతో కలశస్థాపన చేయించారు. అనంతరం గోపూజ జరిగింది. భీమవరం మావుళ్లమ్మ దేవాలయ పండితుడు ఘనాపాటి పరిమెళ్ల వాస్తవ్యులు బాదంపూడి ఫణిశర్మ, బలుసులమ్మ ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్శర్మ, గోపీనా«థ్ శర్మ ల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఉగాది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు మాట్లాడుతూ పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఉగాది ఉత్సవాల తర్వాత నూతన ఆలయంలో అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగనుండటం శుభసూచకంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శ్రీరంగం అంజి, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, టీడీపీ నాయకులు వలవల సూరిబాబు, మునిసిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ , కల్యాణం రామచంద్రరావు, పాలడుగుల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.