ఆమెలో అదే స్పెషల్ !
తమిళసినిమా: ప్రతి మనిషిలోనూ ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. అలా నటి అమలాపాల్‌లోనూ ఒక ప్రత్యేకత ఉందట. అదేమిటో తెలుసా? ఈ అమ్మడి సినీ కేరీర్ పెళ్లికి ముందు, ఆ తరవాత అని విభజించవచ్చు. పెళ్లికి ముందు కథానాయకిగా నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి రెజింగ్‌లో కెరీర్ సాగింది. ఇక పెళ్లి, విడాకులతో కొంచెం తడబడినా తాజాగా మళ్లీ గాడిలో పడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకూ అమలాపాల్ ఖాతాలో రీఎంట్రీలో సరైన హిట్ పడలేదు.
త్వరలో ధనుష్‌తో రొమాన్స్ చేసిన వీఐపీ–2 చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీనిపై అమలాపాల్ చాలా ఆశలు పెట్టుకుంది. కాగా ప్రస్తుతం తిరుట్టుప్పయలే–2, భాస్కర్ ఒరు రాస్కెల్, రెండు మలయాళ చిత్రాలు చేతిలో ఉన్నాయి. తాజాగా మరో తమిళ చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. ఇకపోతే అమలాపాల్‌లో మంచి చెఫ్ ఉందట. సమయం దొరికినప్పుడల్లా వంటింట్లోకి ప్రవేశించి రకరకాల చేపల కూరలను వండుతుందట. అదే విధంగా ఒంటరిగా పయనించడం అమలాపాల్ హాబీల్లో ఒకటట.