నేటినుంచి ‘మున్సిపల్’ నామినేషన్ల స్వీకరణ
14 వరకు గడువు
అయోమయంలో రాజకీయ పార్టీలు
ఇంకా ఖరారు కాని అభ్యర్థుల జాబితా
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
పురపాలక ఎన్నికల్లో కీలక ఘట్టం ఆసన్నమైంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రస్తుతం జిల్లాలో తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, బడంగ్‌పేట నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది. తొలిసారిగా నగర పంచాయతీలైన ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్‌పేట్‌లలో పోటీ తీవ్రంగా ఉంది. న గరానికి సమీపంలో ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. మరోవైపు తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో సైతం పోరు రసవత్తరంగా మారింది. బరిలో నిలిచేవారి జాబితా పెద్ద సంఖ్యలో ఉండడంతో గందరగోళంలో పడ్డ రాజకీయ పార్టీలు.. అభ్యర్థులను మాత్రం ఇప్పటికీ ఖరారు చేయకుండా గోప్యత పాటిస్తున్నాయి.
వ్యూహాత్మకంగా..
సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ‘పుర’పోరులో వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతున్న పుర ఎన్నికల ఫలితాలు త్వరలో జరిగే జనరల్ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశ ం ఉన్నందున అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు సైతం చడీచప్పుడు కాకుండా రహస్య సమావేశాల్లో బిజీగా గడుపుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 14 (శుక్రవారం) వరకు కొనసాగనున్నందున చివరి నిమిషం వరకు అభ్యర్థుల అంశాన్ని గోప్యంగానే ఉంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్లు దక్కని ఆశావహులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.