చర్యల్ని పూర్తిగా కొనసాగించండి
♦ ‘కార్బైడ్ వినియోగం’పై అమికస్ క్యూరీ సూచనలు అమలు చేయండి
♦ మామిడిపండ్ల సీజన్ ప్రారంభానికి ముందే అమలవ్వాలి
♦ ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి
♦ ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం.. విచారణ ఏప్రిల్ 4కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కార్బైడ్ వినియోగాన్ని నిషేధించే విషయంలో ఇప్పటికే తీసుకుంటున్న చర్యలను పూర్తిస్థాయిలో కొనసాగించాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అదేసమయంలో కార్బైడ్ రహిత పండ్లకోసం అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు) ఎస్.నిరంజన్‌రెడ్డి చేసిన సూచనలను మామిడి పండ్ల సీజన్ ప్రారంభానికి ముందే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దానిని తమ ముందుంచాలని ఇరు రాష్ట్రప్రభుత్వాలకు తేల్చిచెప్పింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. పండ్ల వ్యాపారులు కాయల్ని పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్ వాడుతుండటంపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు విచారణ జరుపుతుండడం తెలిసిందే. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. తొలుత తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పండ్ల దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 28 ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి చర్యలు కూడా ప్రారంభించామన్నారు. కార్బైడ్ వాడకం విషయంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ, వ్యాపారుల్ని హెచ్చరిస్తూ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామంటూ, వాటిని పరిశీలన నిమిత్తం ధర్మాసనం ముందుంచారు.
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేష్ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం ఆదేశాల మేరకు మీడియా సహకారం కోరామని, అయితే కేవలం రెండు చానళ్లే సానుకూలంగా స్పందించాయన్నారు. పండ్ల దుకాణాలు, మార్కెట్లలో తరచూ తనిఖీలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. మీడియా సహకారానికి మరోసారి ప్రయత్నించాలని సూచించింది. అమికస్ క్యూరీ ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కార్బైడ్ విషయంలో ఉభయ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని, ఇందుకు సంబంధించి కొంత పురోగతి కూడా ఉందని తెలిపారు. టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేసి, తనిఖీలను విస్తృతం చేయాలని, అలాగే గతంలో తాను సూచించిన సలహాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం... అమికస్ క్యూరీ సూచనలు, సలహాల్ని అమలు చేయాలని ఉభయ రాష్ట్రాలను ఆదేశించింది.