రైనాపైనే అందరి దృష్టి
♦ నేడు భారత్, బంగ్లాదేశ్ ‘ఎ’ జట్ల మ్యాచ్
♦ యువ క్రికెటర్లకు చక్కని అవకాశం
బెంగళూరు : కీలకమైన దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోరుకుంటున్న సురేశ్ రైనాకు మంచి అవకాశం వచ్చింది. మూడు వన్డేల్లో భాగంగా నేడు (బుధవారం) బంగ్లాదేశ్ ‘ఎ’తో జరగనున్న తొలి వన్డేలో భారత్ ‘ఎ’ తలపడనుంది. దీంతో గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న రైనా... ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఫలితంగా ప్రస్తుతం అందరి దృష్టి రైనాపైనే నెలకొంది. చివరిసారిగా బంగ్లాదేశ్ టూర్లో ఆడిన రైనా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పుడు బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్, అమిన్ హుస్సేన్, రూబెల్ హుస్సేన్‌లాంటి నాణ్యమైన పేసర్లను ఎదుర్కొంటే ప్రొటీస్‌పై తిరుగుండదనే భావనతో ఈ యూపీ బ్యాట్స్‌మన్ ఉన్నాడు.
జాతీయ జట్టులో చోటును పదిలం చేసుకునేందుకు కరుణ్ నాయర్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, ధవల్ కులకర్ణి, కర్ణ్ శర్మలు ఈ సిరీస్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చూస్తున్నారు. వచ్చే నెలలో సఫారీ జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్‌కు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో కుర్రాళ్లు భారీ స్కోర్లతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ‘ఎ’తో సిరీస్‌లో రాణించిన ఉన్ముక్త్ చంద్, మయాంక్ అగర్వాల్ కూడా ఈ సిరీస్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు బ్యాట్స్‌మెన్‌పై ఎక్కువగా దృష్టిపెట్టిన ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్... ఇప్పుడు బౌలింగ్‌ను బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. పేసర్లు రుష్ కలారియా, శ్రీనాథ్ అరవింద్, కులకర్ణిలతో పాటు స్పిన్నర్లు కర్ణ్ శర్మ, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లను గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతోంది. వచ్చే నెలలో వాళ్లకు ఆసీస్‌తో సిరీస్ ఉండటంతో దాదాపుగా సీనియర్లందరూ ఫిట్నెస్ కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనున్నారు. దీంతో భారత కుర్రాళ్లు అప్రమత్తంగా లేకపోతే సిరీస్ చేజారే ప్రమాదం ఉంది.