శివాని శుభారంభం
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని శుభారంభం చేసింది. బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో శివాని 6-1, 6-4తో ప్రిన్సి పాంచల్‌పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో శివాని-వైదేహి చౌదరీ జోడీ 6-0, 6-2తో దాదాసాహెబ్ చౌగులే-సృష్టి ధీర్ జంటపై గెలుపొందింది.
మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన షేక్ హుమేరా జోడీకి తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. హుమేరా-ప్రింకిల్ సింగ్ జోడీ 4-6, 6-4, 9-11తో ఎస్తర్-హేత్ గమ్మ జంట చేతిలో పరాజయం పాలైంది. బాలుర సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో పరీక్షిత్ 6-3, 6-3తో శ్రీవత్స రాచకొండపై గెలుపొందగా... తీర్థ శశాంక్ 2-6, 2-6తో దోస్టాన్బెక్ చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ విభాగంలో వశిష్ట్- జాక్ డ్రాపర్ జోడీ 6-2, 6-1తో శ్రీవత్స రాచకొండ-అథర్వ శర్మ జంటపై, బొల్లిపల్లి రిత్విక్-మాచెర జోడీ 6-3, 6-2తో నబీవ్ ఓలిజన్-సచిత్ శర్మ జంటపై గెలుపొందాయి.