ఇకపై అధిక రాబడికి చాన్స్
‘సాక్షి’తో ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ అమిత్ కుమార్ రాయ్
తాజా నిబంధనలతో పాలసీదారులకు లాభం
ఏటా ఏజెంట్ల సంఖ్యను 30% పెంచుతాం
కమీషన్ తగ్గినా అమ్మకాలు పెరుగుతాయ్
పెరుగుతున్న ఆన్లైన్ పాలసీల విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జీవిత బీమా మార్గదర్శకాల వలన కంపెనీల నిర్వహణా వ్యయం తగ్గి, పాలసీదారుల రాబడి పెరుగుతుందని ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఎగాన్ రెలిగేర్ తెలిపింది. కొత్త పథకాలు సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటమే కాకుండా గతంతో పోలిస్తే అధిక ప్రయోజనాలను కల్పిస్తుండటంతో వీటిపై పాలసీదారులకు ఆసక్తి పెరుగుతుందని, దీంతో కమీషన్ తగ్గినా అమ్మకాలు పెరగడం ద్వారా ఏజెంట్లు ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటారని ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ అమిత్ కుమార్ రాయ్ అన్నారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కొత్త ఏజెంట్ల నియామకంలో బీమా కంపెనీలు ఒత్తిడికి గురవుతన్న విషయం వాస్తవమే అయినప్పటికీ మేము ముఖ్యంగా గృహిణులు, పదవీ విరమణ చేసిన వారిపై ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 6,000 మంది ఏజెంట్లు ఉన్నప్పటికీ అందులో 1,200 మంది చురుగ్గా పనిచేస్తున్నారని, ఏటా ఏజెంట్ల సంఖ్యను 30 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ప్రజల్లో బీమాపై అవగాహన పెరుగుతండటంతో ఆన్లైన్ ద్వారా బీమా పథకాల విక్రయం ఎక్కువతోందని, ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో 25 శాతం అన్లైన్ ద్వారా జరుగుతుంటే, 36 శాతం ఏజెంట్ల ద్వారా వస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో ఆన్లైన్ పాలసీల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కొత్త నిబంధనల వలన పాలసీల సంఖ్య తగ్గదని, బీమా కంపెనీలు వాటి వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెడతాయన్నారు. ప్రస్తుతం ఎగాన్ రెలిగేర్ మూడు రకాల పథకాలను అందిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.