‘అమ్మ’ ఉప్పు
సాక్షి, చెన్నై: పేదలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘అమ్మ’ పేరిట ఉప్పు విక్రయాలకు శ్రీకారంచుట్టింది. మూడు రకాల అమ్మ సాల్ట్ ప్యాకెట్లను బుధవారం నుంచి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక సుపరి పాలనే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పేదవర్గాల్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల కోసం ల్యాప్ టాప్‌లు, సైకిళ్లు, ఉచిత పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూ, పాదరక్షల్ని అందిస్తోంది. నగరాల్లోని పేద కార్మికులు, చిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో కడుపు నింపే విధంగా అమ్మ క్యాంటిన్లను కొలువు దీర్చింది.
అలాగే రూ.పదికే అమ్మ మినరల్ వాటర్ బాటిళ్లు, చౌక ధరకే కూరగాయల విక్రయం.. ఇలా అనేక పథకాలతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉప్పు ఉత్పత్తి మీద దృష్టి పెట్టింది. అమ్మ సాల్ట్ : మార్కెట్లలో ఉప్పు ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఉప్పు విక్రయాలకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో రామనాథపురంలో ఉప్పు ఉత్పత్తి నిలయం, పరిశ్రమను ఇటీవల నెలకొల్పారు. ఇక్కడ ముందుగా నిర్ణయించిన మేరకు వంద టన్నుల ఉప్పు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంతో ఇక ప్యాకెట్ల ద్వారా మర్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రకాల ప్యాకెట్లలో ఉప్పు విక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఐరన్ - ఆయోడియం, శుద్ధీకరించిన ఆయోడియం, సోడియం ఉప్పులను మూడు రకాల ధరలతో విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ప్యాకెట్లకు అమ్మ పేరును నామకరణం చేశారు. సీఎం జయలలిత ముఖ చిత్రంతో ఆకర్షణీయ ప్యాకింగ్‌తో సిద్ధం చేసిన ఈ ఉప్పు బుధవారం మార్కెట్లోకి విడుదల కానుంది. చెన్నైలో ఉదయం జరిగే కార్యక్రమంలో ఈ ప్యాకెట్లను సీఎం జయలలిత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మొదటి రకం రూ.పది, రెండో రకం రూ.16, మూడో రకం ఉప్పు రూ.21గా ధర నిర్ణయించినట్టు సమాచారం. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అముదం దుకాణాలు, సహకార దుకాణాల్లో లభిస్తాయి. అలాగే, కాస్త ఎక్కువ ధరతో బయటి దుకాణాల ద్వారా వీటిని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఉప్పు విక్రయాలకు శ్రీకారం చుట్టడంతో ఇక ప్రైవేటు ఉప్పు మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు సంస్థల్ని నమ్ముకుని ఉప్పు ఉత్పత్తిలో ఉన్న తూత్తుకుడి, కడలూరు, నాగపట్నం పరిసరాల్లోని ఉత్పత్తిదారుల్లో ఆందోళన నెలకొంది.
సీబీసీఐడీకి పక్కా భవనం
రాష్ట్ర సీబీసీఐడీకి పక్కా భవనం సిద్ధమైంది. గిండిలో ఇది వరకు సీబీసీఐడీ విభాగ ప్రధాన కార్యాలయం ఉండేది. అయితే ఈ విభాగానికి ప్రత్యేకంగా ఓ భవనం నిర్మించేందుకు ఇటీవల రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఎగ్మూర్‌లో ఉన్న పాత కమిషనరేట్ ఆవరణలో రూ.పది కోట్ల వ్యయంతో ఐదు అంతస్తులతో భవనాన్ని ఆగమేఘాలపై నిర్మించారు. అన్ని రకాల వసతులు, హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనాన్ని బుధవారం సీఎం జయలలిత ప్రారంభించబోతున్నారు. మంగళవారం ఈ భవనంలో చేసిన ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ రామానుజం, చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్‌లు పరిశీలించారు.