ఆట మొదలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే కార్యక్రమం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. యువ నేత రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే ఆనందరావు దేడ్మరే ఏఐసీసీ పరిశీలకుడుగా కామారెడ్డిలో మకాం వేశారు. రాత్రి పొద్దుపోయేవరకు నియోజకవర్గాలవారీగా ప్రజాప్రతినిధులు, పార్టీ బ్లాక్, మండల అధ్యక్షులు, ముఖ్యనాయకుల అభిప్రాయాలను స్వీకరించారు.
ఏఐసీసీ పరిశీలకు డు వస్తున్నారన్న విషయం ముందుగానే లీక్ కావడంతో అసెంబ్లీకి పోటీచేయాలనుకుంటు న్న ఆశావహులు తమ అనుచరులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలను కామారెడ్డికి తరలించా రు. ఏఐసీసీ పరిశీలకుడు, ఆయన వెంట వచ్చిన మరో నాయకుడు ప్రత్యేక గదిలో నా యకులను కలుసుకున్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, జనార్దన్‌గౌడ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, నాయకులు ఆకుల శ్రీనివాస్, వెంకట్రామ్రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మామిండ్ల అంజయ్య, బాలరాజు, కైలాస్ శ్రీనివాస్, శివకుమార్, జమునారాథోడ్ తదితరులు మరో గదిలో కార్యకర్తలతో కలిసి ఉన్నారు.
బలప్రదర్శన
అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు బలప్రదర్శన ను తలపించే విధంగా గ్రూపులుగా తరలివచ్చారు. కొంత మంది ఆశావహులైతే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి కార్యకర్తలను తీసుకువచ్చారు. కార్యకర్తలకు భోజనాలతో పాటు అన్ని వసతులను కల్పించారు. అభిప్రా య సేకరణ కార్యక్రమం మొక్కుబడిగా సాగినప్పటికీ, రాత్రి పొద్దుపోయేవరకు కార్యకర్తలు అక్కడనే వేచి ఉన్నారు. అభిప్రాయ సేకరణ సందర్భంగా పలువురు నేతలపై ఆరోపణల పరంపర కొనసాగినట్టు సమాచారం. కొందరు నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అక్కసును వెళ్లగక్కినట్లు తెలిసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు కేటాయించకుండా, ఇతర పార్టీల వారికి కేటాయించిన విషయాలను కూడా పలువురు ప్రస్తావించినట్లు తెలిసింది.
పరిశీలనకు పలువురి పేర్లు
జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఏఐసీసీ పరిశీలకుడి ఎదుట ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, గంగారాం, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ పేర్లను వారివారి అనుచరులు ప్రతిపాదించారని సమాచారం. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ మంత్రి ఆంజనేయులు, జమునా రాథోడ్‌తోపాటు మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పేరు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
బాన్సువాడకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, పార్టీ నాయకులు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బాలరాజు, శివకుమార్ పేర్లను పరిశీలించినట్టు తెలిసింది.
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ పేరునే ప్రముఖంగా చెప్పినప్పటికీ, కొందరు ప్రజాప్రతినిధులు మామిండ్ల అంజయ్య, కైలాస్శ్రీనివాస్ పేర్లను కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నాయకులూ షబ్బీర్‌అలీ అనుచరులైనప్పటికీ ఆశావహులలో ఉన్నట్లు సమాచారం.
ఎంపీ అభ్యర్థిగా షెట్కారే!
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన పలువురు ఆశావహులు, నాయకులు, కార్యకర్తలు ఎంపీ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్ పేరునే ఏఐసీసీ పరిశీలకుని వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. మరో ఇద్దరు నేతల పేర్లు కూడా పరిశీలకుని వద్ద పేర్కొన్నప్పటికీ, జిల్లా నాయకులు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు నేతల పేర్లు పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కోసం జరిపిన అభిప్రాయంలో పరిశీలకుని వద్ద వెల్లడైనట్లు సమాచారం.