‘అల’వోకగా
సర్కారు బడుల్లో..‘ఆనంద లహరి’
జిల్లాలో 135 పాఠశాలలు ఎంపిక
మొదటి దశ ప్రారంభం
1.2 తరగతులకు నూతన అభ్యసన ప్రక్రియ
రిషివ్యాలీ తరహాలో విద్యాబోధన
విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించిందేకు విద్యాశాఖ అధికారులు ఆనందలహరి (అల)పథకాన్ని రూపొందించారు. ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతి విద్యార్థులకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానంలో తరగతి గదులను నూతనంగా తీర్చిదిద్దుతారు. విద్యార్థులు ఆడుకుంటూ అక్కడే ఉన్న బోధనోపకరణాలను సందర్భోచితంగా ఉపయోగించుకుంటారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి, మండలానికి రెండు పాఠశాలల వంతున ఎంపిక చేశారు. మొదటి దశలో రెవెన్యూ డివిజన్లలో ‘ఆనందలహరి’ కార్యక్రమాన్ని జిల్లాలో మంగళవారం ప్రారంభించారు.
- రాయవరం(మండపేట)
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ‘అల’ అభ్యసన విధానం అమలు చేసేందుకు 1,342 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో 135 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. మొదటి దశలో ఏడు రెవెన్యూ డివిజన్లలో ప్రారంభిస్తుండగా..కాకినాడ రూరల్ మండలం పండూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంఛనంగా ప్రారంభించారు. మిగిలిన డివిజన్ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
స్వీయం..సరళం..
‘అల’ విధానంలో ఆయా పాఠశాలల్లో 1, 2 తరగతులు చదివే విద్యార్థులకు ఈ విధానంలో బోధన సాగిస్తారు. విద్యార్థులు పుస్తకాలను ఇంటి నుంచి తీసుకుని రావాల్సిన పనిలేదు. ఐదుగురు ఒక విద్యార్థులకు ఒక ట్యాబ్ వంతున ఇస్తారు. ఇక్కడ బోధన అంతా స్వీయ అభ్యసనంతో పాటు సరళమైన విధానంలో ఉంటుంది. ఒక అడుగున్న టేబుల్ చెస్ బోర్డు తరహాలో ఏర్పాటు చేసి కుర్చీలు ఉంటాయి. గోడ అంతా బ్లాక్ బోర్డు ఉంటుంది. పిల్లలకు బ్లాక్ బోర్డు మీద కొంత భాగం కేటాయిస్తారు. అక్కడే అందుబాటులో షెల్ఫ్ ఉంటుంది. అందులో బోధన ఉపకరణాలను తీసుకుని పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల సహకారంతో సొంతంగా అవగాహన పొందుతారు. విద్యార్థి కేంద్రీకృతంగా విద్యాబోధన ఉంటుంది. ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థికి సహకారంగానే ఉంటాడు. బోధన అభ్యసన పద్ధతులను, గుర్తించిన విధానం మేరకు వారి స్థాయిని గుర్తిస్తారు. ఈ విధానంలో ఎప్పటికప్పుడు ఏ మేరకు విద్యార్థులు అవగాహన చేసుకుకున్నారో? లేదో? స్పష్టమవుతోంది. కృత్యాధార బోధన ద్వారా గణిత భావనలు సందర్భానుసారంగా ఆసక్తికరంగా, ఆనందకరంగా వైవిధ్యంగా ఉండడంతో ఆసక్తిగా పాల్గొంటారు.
మొదటి దశలో ఆనందలహరి ప్రారంభమైన పాఠశాలలివే..
రెవెన్యూ డివిజన్ పాఠశాల
కాకినాడ పండూరు
రాజమహేంద్రవరం కొంతమూరు
అమలాపురం భట్లపాలెం
పెద్దాపురం మరువాడ
రామచంద్రపురం ఉండూరు
రంపచోడవరం బోసిగూడెం
ఎటపాక యర్రంపేట
విద్యార్థులకు చేరువవుతుంది..
ఈ విధానం తప్పనిసరిగా విద్యార్థులకు చేరువవుతుంది. ఇటు విద్యార్థులపై అటు ఉపాధ్యాయులపై ఒత్తిడి లేని రీతిలో ఆటపాటలతో కూడిన బోధన సాగుతుంది. ఈ విధానంలో నిరంతర మూల్యాంకనం చేరుతుంది. రిషివ్యాలీ విధానంలో ఆనందలహరి ఉంటుంది. ఈ విధానం తప్పనిసరిగా విజయవంతమవుతుంది. ఇప్పటికే ఈ విధానంలో ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం.
– మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ, కాకినాడ.