‘అనంత’ మీదుగా ఎర్రచందనం రవాణా
అనంతపురం సెంట్రల్ : ఎర్రచందనం స్మగ్లింగ్ రూటు మారింది. ఇన్నాళ్లూ స్మగ్లింగ్‌కు అడ్డాగా నిలిచిన పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో స్మగ్లర్లు కొత్త పోర్టులపై కన్నేశారు. అనంత మీదుగా గోవా పోర్టు ద్వారా దుంగలను విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల 15సార్లు పోలీసులు ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ‘ఎర్రచందనం’ దుంగలను ఇన్నాళ్లూ చైన్నె, కొచ్చి, ముంబై పోర్టులకు తరలించేవారు. ఐదునెలల కిందట చెన్నై పోర్టులో ఒకసారి 120 టన్నల దుంగలను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. దీంతో దొంగలు రూటు మార్చి అనంత మీదుగా గోవాకు తరలిస్తున్నారు.
ఇటీవల ‘అనంత’ పోలీసుల తనిఖీల్లో 15సార్లు దుంగలు పట్టుబడ్డాయి. 14 వాహనాలు, 11.8టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 70లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న లక్ష్మణ్‌నాయక్(మణిపూర్), రియాజ్(కర్ణాటక)తో పాటు పదిమంది అంతర్జాతీయ స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో స్మగ్లింగ్ ద్వారా లక్ష్మణ్ నెలకు 20, రియాజ్ 15కోట్ల రూపాయలు సంపాదించేవారు. దీంతో కర్ణాటక మీదుగా గోవాకు దుంగలను తరలించే బాధ్యత రియాజ్ అనుచరులు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.