అనపోతారెడ్డి రాజ్యంలో ఆరని చిచ్చు
∙తనయుడి కోసం ఓ తండ్రి ఆరాటం
∙చక్కదిద్దని ‘చంద్ర’వంశ రాజు
(లక్కింశెట్టి శ్రీనివాసరావు) :
అదొక రెడ్డి రాజ్యం... ఒకప్పుడు అనపోతారెడ్డి రాజులు పాలించిన రాజ్యమది. చారిత్రక నేపథ్యం కలిగిన రాజమహేంద్రవరం రాళ్లబండి సుబ్బారావు మ్యూజియంలో ఈ మేరకు శాసనం కూడా ఉందంటారు.
అనగనగా... ఆ రెడ్డి రాజ్యంలో అనగనగా ఒక తండ్రి. అతనికో కొడుకు. ఆ రాజ్యాన్ని పాలించిన రాజుల్లో ఎక్కువ కాలం (నాలుగు పర్యాయాలు) పాలించిన రెడ్డి రాజు వయోభారంతో ‘మూల’న కూర్చున్నాడు. ‘రామకృష్ణు’లే కలిసి వచ్చారంటూ ప్రజలను నమ్మించి తన సింహాసనాన్ని వారసుడికి అప్పగించాడు ఆ రెడ్డి రాజు. కురువృద్ధుడైన ఆ రాజు ఎప్పటిలానే ఇంటి వరండాలో సామంతులు, భటుల మధ్య కూర్చుని రాజ్యంలో జరుగుతున్న పరిణామాలపై పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలోనే రాజకీయ వారసుడు వచ్చాడు. కొద్దిసేపు మాటా మంతీ అయ్యాక చర్చ రాజ్యంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలవైపు మళ్లింది. వరండాలో కూర్చున్న వారిని చూసి యువరాజు ఏమీ మాట్లాడలేక మౌనముద్ర దాల్చాడు. ఒకనాడు ఆ రాజ్యాన్ని తన కనుసన్నల్లో రెండు దశాబ్దాలు పాలించిన ఆ ‘రెడి’్డ రాజు మనసు ఎరిగిన వారు కావడంతో వారసుడిని విడిచిపెట్టి మిగిలిన మంత్రులు, సామంతులు, భటులు అంతఃపురంలోకి వెళ్లిపోయారు. ఒకపక్క రెండు దశాబ్దాల రాజ్యాన్ని ఏలిన చరిత్ర కలిగిన తండ్రి. మరోపక్క సింహాసనమెక్కిన మూడేళ్ల ముచ్చటలో తనయుడు. ఇద్దరి మధ్య సంభాషణ షురూ అయింది. అతని తండ్రి రెడ్డిరాజుతో బద్ధ విరోధి అయిన పాతకాలపు రాజు విషయం చర్చకు వచ్చింది. పొరుగున పెద్దల పుర రాజ్యాన్ని ఏలిన భాస్కరరాముడు అనే కమ్మని రాజుతో పడలేకపోతున్నానని రెడ్డి రాజ్యాన్ని ఏలుతున్న తనయుడు తండ్రికి మొరబెట్టుకున్నాడు. ఆ ‘కమ్మ’ని రాజు ఒక సాయంసంధ్య వేళ తన అంతఃపురంలో ‘చంద్ర’వంశ రాజు భిక్షతో కొత్తపేట సామ్రాజ్యంలో పెత్తనం చెలాయిస్తున్న రెడ్డి కాని రెడ్డిరాజు, సముద్ర ఎగుమతులు జరిగే ఓడరేవులున్న సువిశాల సామ్రాజ్యాన్ని ఏలుతున్న రాణి భర్త, వారి అనుచరగణంతో ఏకాంతంగా భేటీ అయిన విషయాన్ని తండ్రి వద్ద పెట్టాడు.