కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇద్దరు నైజీరియన్ల నుంచి రూ.2 కోట్ల విలువైన కొకైన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నారన్న అనుమానంతో ఈ నెల ఒకటో తేదీన రాజధాని ఉత్తమ్‌నగర్‌లో కెన్నడీ డొమినిక్(34), అనయో గాడ్స్విల్(35) అనే నైజీరియా దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 492 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మార్కెట్లో దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ విభాగం అధికారులు తెలిపారు. గాడ్స్విల్ ఢిల్లీకి చెందిన మహిళను పెళ్లి చేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నాడని వివరించారు. డ్రగ్స్ రవాణాతో ఇతడు కోట్లాది రూపాయలు సంపాదించి విలావ వంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడని చెప్పారు. ఇతని ఆస్తులన్నీ భార్యపేరు మీదే ఉన్నాయన్నారు. మరోవైపు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ.9.20 లక్షల విలువైన మెథక్వనోల్ మాత్రలను కువైట్‌కు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.