ఆయన సినిమా ట్రెయిలరే 72 గంటలు
స్టాక్‌హోమ్: దాదాపు 500 సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలను, వందకుపైగా మ్యూజిక్ వీడియోలను తీసి పారలల్ చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించిన ప్రముఖ స్వీడిష్ డెరెక్టర్, నటుడు ఆండర్స్ వెంబెర్గ్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయని ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏకబిగిన 30 రోజులపాటు కొనసాగే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకోసం టీజర్ క్లిప్‌ను విడుదల చేసిన ఆండర్స్ సినిమా ప్రచారం కోసం 72 గంటల 20 నిమిషాల నిడివిగల ట్రెయిలర్‌ను విడుదల చేస్తున్నారు.
తన భారీ సినిమా ట్రెయిలర్ 2018లో విడుదల చేస్తానని, 2020లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తానని, అది కూడా ఒకే షోను ప్రదర్శిస్తానని, ఆ తర్వాత దాన్ని నాశనం చేస్తానని ఆయనిక్కడ మీడియాకు తెలిపారు. మరో ప్రముఖ దర్శకుడు ఇంగ్మర్ బెర్గ్మన్ 1957లో తీసిన ఫాంటసీ డ్రామా చిత్రం ది సెవెన్త్ సీల్ షూటింగ్ నిర్వహించిన స్వీడన్ సదరన్ బీచ్‌లోనే ఆండర్స్ తన సినిమా ఆంబియన్స్ ట్రెయిలర్ షూటింగ్‌ను చేపట్టారు.
ది సెవెన్త్ సీల్ చిత్రం థీమ్ వరుసలోనే తన చిత్రం ఓ జీవన ప్రయాణంలాగా సాగే నైరూప్య కలలతో కూడి ఉంటుందని ఆండర్స్ వివరించారు. ఓ పర్వత వీరుడు తనను చంపడానికి వచ్చిన మృత్యువుతో చెస్ ఆడుతున్న దృశ్యాలను బెర్గ్మన్ స్వీడన్ సదరన్ బీచ్‌లోనే చిత్రీకరించారు. ఆండర్స్ తీస్తున్న 72 గంటల 20 నిమిషాల సినిమా ట్రెయిలర్‌ను చూశాక ప్రేక్షకులు కచ్చితంగా కాలం స్తంభించిపోయినట్లు భావిస్తారని ఐఎండీబీ వ్యాఖ్యానించింది.