టి బాస్కెట్‌బాల్ సంఘం కార్యదర్శిగా సంపత్
తెలంగాణ సంఘాల ఆవిర్భావం షురూ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో తెలంగాణలో క్రీడా సంఘాల ఆవిర్భావం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం(ఏపీఓఏ) ఇటీవలి సమావేశంలో మే 15లోగా తెలంగాణ క్రీడా సంఘాల ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీంతో రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జి.ఎం.సంపత్ కుమార్ తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (టీబీఏ)ను ఏర్పాటు చేసి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో జరిగిన తెలంగాణ జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ల కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం 2014 నుంచి 2018 వరకు కొనసాగుతుంది.
టీబీఏ కార్యవర్గం: చైర్మన్‌గా జి.సత్యనారాయణ (రంగారెడ్డి), అధ్యక్షుడుగా రాజేందర్‌రెడ్డి (నిజామాబాద్), ఉపాధ్యక్షులుగా ఆర్.శ్రీధర్‌రెడ్డి (ఆదిలాబాద్), అనంతరెడ్డి (కరీంనగర్), ఖాదర్ అబ్దుల్లా (రంగారెడ్డి), ప్రతాప్‌రెడ్డి (వరంగల్) డి.వై.చౌదరి (ఖమ్మం), ప్రధాన కార్యదర్శి జి.ఎం.సంపత్ కుమార్(హైదరాబాద్), సంయుక్త కార్యదర్శులుగా నార్మన్ ఇసాక్ (మహబూబ్‌నగర్), రఘునందన్‌రెడ్డి (నిజామాబాద్), కోశాధికారిగా నార్మన్ ఇసాక్ (మహబూబ్‌నగర్)లు ఎన్నికయ్యారు. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ అఫిషియల్ పీటర్ సంతోష్ దివాకర్ (హైదరాబాద్) టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.