ఆంధ్రప్రదేశ్‌కు కాంస్య పతకం
జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ మహిళల పైకా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ జట్టు కాంస్య పతకం సాధించింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు గురువారం ముగిశాయి. హ్యాండ్‌బాల్ ఈవెంట్లో మూడో స్థానం కోసం జరిగిన పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టు... ఉత్తర్‌ప్రదేశ్ జట్టుపై గెలిచింది. అయితే అంతకుముందు జరిగిన ఫైనల్లో పంజాబ్ జట్టు... హర్యానా జట్టుపై నెగ్గి స్వర్ణ పతకం గెలుచుకుంది.
హర్యానా రజతంతో సరిపెట్టుకుంది. మార్చ్‌పాస్ట్‌లో మణిపూర్ విజేతగా నిలవగా... ఆంధ్రప్రదేశ్ రన్నరప్‌గా నిలిచింది. హాకీ పోటీల్లో ప్రథమ స్థానంలో హర్యానా, వరుసగా రెండు, మూడు స్థానాల్లో మధ్యప్రదేశ్, ఒరిస్సా జట్లు నిలిచాయి. లాన్ టెన్నిస్‌లో హర్యానా విజేతగా నిలవగా... చండీగఢ్ రెండో స్థానాన్ని, ఢిల్లీ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను 20 పాయింట్లు సాధించిన హర్యానా గెలుచుకుంది. విజేతలకు హైదరాబాద్ కలెక్టర్ ముఖేశ్ కుమార్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు.