AP: తగ్గిన రాష్ట్ర ఆదాయం
సాక్షి, అమరావతి: గత రెండు ఆర్థికసంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం కంటే 2019–20, 2020–21 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చే ఆదాయంతో పాటు రాష్ట్ర ఆదాయమూ తగ్గిపోయిందని వెల్లడించింది.
కోవిడ్–19 ప్రభావం, లాక్ డౌన్, ఆంక్షల కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాతో పాటు రాష్ట్ర సొంత ఆదాయం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా కేంద్ర పన్నుల వాటా రూపంలో వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. 2018–19తో పోలిస్తే 2019–20లో రూ.4,545 కోట్లు తగ్గింది. 2020–21లో ఏకంగా రూ. 8,326 కోట్లు తగ్గింది. రాష్ట్ర వస్తు సేవల పన్నుతో పాటు అమ్మకం పన్ను, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర రంగాల ద్వారా వచ్చే ఆదాయం కూడాఆ రెండేళ్లలో తగ్గిపోయినట్లు తెలిపింది.
బాగా పెరిగిన తప్పనిసరి వ్యయం
రాష్ట్ర ప్రభుత్వ తప్పనిసరి వ్యయం బాగా పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ప్రధానంగా వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు భారీగా పెరిగినట్లు తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో వడ్డీ చెల్లింపుల వ్యయం ఏకంగా 13 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది.
గతంలో చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు పెరిగిపోతున్నట్లు తెలిపింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం కూడా 2019–20తో పోలిస్తే 2020–21లో ఏకంగా 13 శాతం పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం ఇవ్వడం, కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో వేతనాల వ్యయం భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ల వ్యయం కూడా 2019–20తో పోలిస్తే 2020–21లో 0.48 శాతం మేర పెరిగినట్లు తెలిపింది.