యూఎస్ విద్యపై మోజెక్కువ
చెన్నై, సాక్షి ప్రతినిధి : యునెటైడ్ స్టేట్స్లో ఉన్నత విద్యనభ్యసించడంపై భారతీయుల్లో నానాటికీ మోజు పెరుగుతోందని చెన్నై యూఎస్ కాన్సులేట్ జనరల్ (చెన్నై)లో యూఎస్ కల్చరల్ అఫైర్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆండీ డీ ఆర్మెంట్ చెప్పారు. ‘ఉన్నత విద్యలో అంతర్జాతీయత’ అనే అంశంపై చెన్నై విట్ క్యాంపస్‌లో శుక్రవారం జరిగిన సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం యూఎస్‌లో లక్ష మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు.
గత విద్యాసంవత్సరంలో భారత విద్యార్థుల సంఖ్య ఆరు శాతం పెంపును సూచిస్తోందన్నారు. విద్యార్థులు డిగ్రీలేదా పీజీ పట్టా పుచ్చుకుంటే సరిపోదు, మరెన్నో అంశాల్లో నిష్ణాతులను చేయడమే యూఎస్ విద్యావిధానంలోని ప్రత్యేకత అన్నా రు. నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక శక్తి, స్కిల్స్ పెంచడం, కళలపై శిక్షణ, బోధనా విధానాలు తదితర అనేక అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు నిస్తామన్నారు.
ఈ కారణం చేతనే యూఎస్ విద్యపట్ల నేటి భారతీయ యువత మొగ్గుచూపుతోందని వివరించారు. భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఏడాది ఆరు శాతం పెరిగిందన్నారు. ఐదేళ్లకాలాన్ని లెక్కిస్తే 60 శాతం పెరుగుదల ఉందన్నారు. అంతర్జాతీయ విద్యావారోత్సవాలు జరుగుతున్న తరుణంలో చెన్నై విట్‌లో అదే అంశంపై ప్రసంగించే అవకాశం కలగడం సంతోషమన్నారు. విట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ 2013-14 విద్యా సంవత్సరంలో 8,86,052 మంది వివి ద దేశాలకు చెందిన విద్యార్థులు యూఎస్‌లో విద్యనభ్యసించగా, వారిలో 3.40 లక్షల మంది యూఎస్ సహకారంతోనే ఉన్నతమైన ఉద్యోగాలు పొందారని అన్నారు. విట్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.