మిస్టర్ 'హానెస్ట్' @ ఫేస్బుక్
నీతి, న్యాయం, ధర్మాలతోపాటు నిజాయితీ అనే కలికితురాయి పొదిగిన కిరిటం బహుకరించాలంటే అందుకు ఆండీ సామ్యూల్స్ తల సరిగ్గా సరిపోతుంది. ఫేస్బుక్ ప్రపంచ జనాభా చేత (ప్రస్తుతం ఆ సంఖ్య 120 కోట్ల పైనే) 'మిస్టర్ హానెస్ట్'గా మన్ననలందుకుంటున్న 31 ఏళ్ల ఆండీ ఏం చేశాడంటే..
పావలానో, పరకో.. తమది కానిది ఎంత దొరికినా డైరెక్ట్ గా జేబులోకి తోసేస్తారు చాలామంది. అలా దొరికేది కాస్త విలువైన వస్తువైతే.. ఏకంగా వజ్రాలు పొదిగిన ఉంగరమే అయితే!? ఇక మాటలు అనవసరమనుకుంటారేమో! అయితే ఆండీ అలా అనుకోకపోవడానికి, ఫేస్ బుక్ వేదికగా తనకు దొరికిన వస్తువును తిరిగి ఇచ్చెయ్యడానికి ఓ బలమైన కారణం ఉంది.
లండన్లో నివసిస్తూ చిన్నాచితకా ఉద్యోగాలతో కాలం నెట్టుకొస్తున్న ఆండీ సామ్యూల్స్.. గత శనివారం తెల్లవారుజామున ప్రఖ్యాత నాండూస్ రెస్టారెంట్ ఎదురుగుండా నడుస్తూ వెళ్తుండగా.. రోడ్డుపై ధగధగా మెరుస్తున్న డైమండ్ రింగ్ కనిపించింది. దాన్ని జేబులో వేసుకున్న ఆండీ, ఇంటికెళ్లాక 'ఈ డైమండ్ రింగ్ ఎవరిది?' అంటూ ఫేస్ బుక్ లో ప్రచారం ప్రారంభించాడు. ఐదురోజుల సెర్చ్ అనంతరం ఓ మహిళ.. అన్ని ధ్రువపత్రాలతో ఆ రింగ్ తనదేనంటూ ఆండీని అప్రోచ్ అయింది. కథ సుఖాంతమైంది.
ఇంతకీ మనోడు ఇంత నిజాయితీ ప్రదర్శిచడానికి కారణం చెప్పుకోనేలేదు కదా, గతంలో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఆండీ, ఫేస్ బుక్ ద్వారా ఆ విషయాన్ని షేర్ చేశాడట. కొద్ది రోజుల్లోనే అనూహ్యంగా తన మొబైల్ తిరిగి చేతికొచ్చిందట. అలా ఓ నాలుగైదుసార్లు జరిగిందట. బూమరాంగ్ లాగా! తెలియనివాళ్లు తన వస్తువును తిరిగిచ్చినట్లే తనకు తెలియనివారి వస్తువును తానూ తిరిగిచ్చేశాడు. అందుకే ఎఫ్ బీ ఫాలోవర్లతో 'మిస్టర్ హానెస్ట్' బిరుదు పొందాడు.