విభిన్నంగా కనిపిస్తా.. : ధనుష్
‘‘ఈ చిత్రంలో నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాను. మనిషిలో ఉండే నాలుగు కోణాలను ఇందులో చూపించారు. నా ‘రఘువరన్ బీటెక్ ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తా’’ అని తమిళ నటుడు ధనుష్ తెలిపారు. ఆయన హీరోగా నటించిన ‘అనేకుడు’ పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఎ.జి.ఎస్ ఎంటెర్టైన్మెంట్ పతాకంపై కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేష్, కల్పాత్తి ఎస్.సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
‘రంగం’ ఫేం కె.వి. ఆనంద్ దర్శకుడు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వీవీ వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.వి. ఆనంద్ మాట్లాడుతూ- ‘‘డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఉండే రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. హారీస్ జైరాజ్ మంచి పాటలతో పాటు, మంచి నేపథ్య సంగీతం అందించారు’’ అని చెప్పారు. ‘‘‘ఈ చిత్రం ప్రచార చిత్రాలు చూస్తుంటే కథ ఏమై ఉంటుందా అనే కుతూహలం కలుగుతోంది’’ అని వినాయక్ అన్నారు. నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ-‘‘ ఆనంద్ మొదట నాకే కథ చె ప్పారు. ఆయన చెప్పినదానికన్నా ఇంకా అందంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు నిర్మాతలు. ఠాగూర్ మధు, మల్టీడెమైన్షన్ వాసు, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.