తెలుగమ్మాయి అనుమానాస్పద మృతి
సాక్షి, ముంబై: భవిష్యత్తులో ఎందరికో ప్రాణం పోయాల్సిన ఓ భావి డాక్టర్ ప్రాణం అర్ధంతరంగా గాలిలో కలిసిపోయింది. శుక్రవారం ఆమె జెస్లోక్ ఆస్పత్రిలో మరణించిన స్థితిలో కనిపించింది. మృతురాలిని హైదరాబాద్‌కు చెందిన దివ్య మాచిరాజు(26)గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.
అనస్థీషియా డ్రగ్‌ను మోతాదుకు ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ కావడంతోనే మరణించిందని పోలీసులు భావిస్తున్నారు. ‘ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నాం.
ఆమె శరీరంలోకి మోతాదుకు మించి అనస్థీషియా డ్రగ్ ఇంజెక్ట్ కావడం వల్లే ఆమె మరణించి ఉండవచ్చు. అయితే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతాం. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక నిజానిజాలు తెలుస్తాయి. దర్యాప్తులో ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టమ’ని దర్యాప్తు అధికారి వర్ధన్ ‘సాక్షి’తో చెప్పారు.
ఈ విషయంపై పోలీసులు అందించిన వివరాల మేరకు.. మూడు నెలల కిందటే జెస్లోక్ ఆసుపత్రిలో వైద్యవిద్య(ఎంఎస్)ను అభ్యసించేందుకు దివ్య చేరింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువు కొనసాగిస్తున్న ఆమె శుక్రవారం ఉదయం మరణించిన స్థితిలో కనిపించింది. అయితే ఆమె గదిలో ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదు.
సందేహిస్తున్న కుటుంబసభ్యులు..
దివ్య మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంతగా ఇబ్బందులేమీ లేవని చెబుతున్నారు. ఏదైతే డ్రగ్ తీసుకొని మరణించిందని చెబుతున్నారో ఆ డ్రగ్ మార్కెట్లో అంత సులభంగా లభించదని, పోలీసులు చెబుతున్నట్లుగా మోతాదుకు మించి ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేసుకుంటే కేవలం మూడు నిమిషాల్లో మరణించేందుకు అవకాశం ఉందంటున్నారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.