ఆ మాటే.. విజయానికి బాట
పేతురు వృత్తి రీత్యా జాలరి. ఆ వృత్తిలో ప్రతిభావంతుడు కూడా! ఇశ్రాయేలు దేశంలో ఉత్తరంలోని గలిలయ ప్రాంతపు గెన్నెసరెతు సరస్సు ఆ దేశమంతటికీ నీళ్లిచ్చే జీవనాడి. ఆ తీరంలోని కపెర్నహూము... పేతురు స్వస్థలం. పేతురుకు చేపలు పట్టడంలో ఉన్న నైపుణ్యం కారణంగా అతని మాట మేరకు ఒక రాత్రి పేతురు, మరికొంతమంది యువకులు చేపల వేటకు పూనుకున్నారు. కానీ రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు. ఆ భారంతో సూర్యోదయవేళ సరస్సు తీరంలో వలలు కడుక్కొంటూ ఉండగా పేతురును యేసుక్రీస్తు కలిశాడు. ఆయన వెంట వందల మంది జనం ఉన్నారు.
యేసు పేతురును అడిగి, అతని పడవలో కూర్చొని ప్రజలకు దేవుని మాటలు వివరిస్తూ ప్రవచనం చేశాడు. అది ముగిసిన తర్వాత పడవను సరస్సు లోపలికి అంటే లోతుల్లోకి నడిపించమని యేసుప్రభువు పేతురుతో అన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా పట్టలేకపోయిన తన ఘోర వైఫల్యాన్ని ప్రభువుకు చెప్పుకున్నాడు పేతురు. కానీ ప్రభువు ఆజ్ఞ మేరకు లోతుల్లోకి పడవను నడిపించాడు. ‘‘నిన్న రాత్రి నా జ్ఞానం, మాట చొప్పున వలలు వేశాను. కానీ, ఇప్పుడు నీ మాట చొప్పున వలలు వేస్తా’’ అంటూ ప్రభువు మాట చొప్పున పేతురు వలలు వేశాడు. అంతే... వలలు పిగిలిపోతాయా అన్నంతగా విస్తారంగా చేపలు పడ్డాయి.
ఆ చేపలతో పేతురుదే కాదు అతని పాలివారైన యాకోబు, యోహానుల దోనె కూడా నిండింది. అది చూసి పేతురు ఆశ్చర్యచకితుడయ్యాడు. యేసు ప్రభువుకు మొక్కాడు. అప్పుడు పేతురుతో యేసు ‘‘ఇక నుండి దేవుని కోసం మనుషులను పట్టే జాలరివి’’ అంటూ ఆశీర్వదించాడు (లూకా 5:1-11). అదే జరిగింది కూడా!
నిన్న రాత్రి వైఫల్యంతో కూడిన అవమానం, ఉదయం కల్లా అత్యుద్భుతమైన విజయానందం, అదే సాయంత్రం కల్లా మనుషుల్ని దేవుని మార్గానికి మళ్లించే మహా సువార్తికుడుగా పదౌన్నత్యం! ఇదీ పేతురు జీవితం. పేతురుకే కాదు ప్రభువును ఆశ్రయించే వారందరికీ ప్రభువిచ్చే మహాభాగ్యం ఇది.
జీవితంలో విఫలమైన వాళ్లకు లోకం సున్నా మార్కులు వేసి, ఎందుకూ పనికిరానివారన్న ‘లేబుల్’ తగిలించి అవమానిస్తుంది. దేవుడు మాత్రం వారితో నేనున్నానంటాడు. లోకానికి పనికిరానివారే నాకు కావాలంటాడు. పరలోకరాజ్య నిర్మాణ మహాకార్యంలో వాళ్లే నా సహకార్మికులంటాడు. జీవితంలోని వైఫల్యాలనే రహదారులుగా మార్చి ఆ మార్గంలోని దేవుడు వారికి మహా ఆశీర్వాదాలనే గమ్యానికి నడిపిస్తాడు. - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్