అమ్మ కోసం భారత్‌లో అన్వేషణ..!
న్యూఢిల్లీ: అనూహ్య పరిస్థితుల్లో తల్లి దండ్రులకు దూరం కావడం, ఆపై ఎదిగిన తర్వాత తనకు జన్మనిచ్చిన వారికోసం వెతకడం అనేక సినిమాల్లో మనకు సుపరిచితమే. దాదాపు ఇది తరహా కథను తలపిస్తోంది డచ్ స్పీడ్ స్కేటర్ అనిస్ దాస్ లైఫ్ స్టోరీ. ఎనిమిది నెలలు వయసున్నప్పుడు నెదర్లాండ్ జంట దత్తత తీసుకోవడంతో అనిస్ అక్కడే స్థిరపడిపోవాల్సి వచ్చింది. అయితే తనకు జన్మనిచ్చిన తల్లి ఎవరో తెలుసుకునే పనిలో పడింది భారత్ మూలాలున్న అనిస్. దీనిలో భాగంగా త్వరలోనే భారత్‌కు రానుంది. వచ్చేనెలలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ తర్వాత తల్లిని అన్వేషించడం కోసం ముంబైకు రానున్నట్లు అనిస్ వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే.. అనిస్, ఆమె సోదరి కవల పిల్లలు. వీరికి 8 నెలల వయసున్నప్పుడు డెన్మార్క్‌కు చెందిన జంట దత్తత తీసుకుని తమతోపాటు తీసుకెళ్లింది. కాగా, 5-6 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారు తన అసలు అమ్మా నాన్న కాదనే విషయం అనిస్‌కు తెలిసింది. దీంతో అప్పటి నుంచి సోదరితో కలసి తమ మూలల కోసం వెతకడం ఆరంభించింది. అయితే వారి ప్రయత్నాలు ఎక్కడ మొదలెట్టారో తిరిగి అక్కడికే వచ్చి ఆగాయి. ఈసారి మాత్రం జన్మదాతను కలుసుకోవాలనే పట్టుదలతో ఉన్నారీ కవల సోదరీమణులు. ఇప్పటివరకూ మీడియా ద్వారా చాలా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయిందని అనిస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత భారత్‌కు వెళ్లి అమ్మ గురించి సోదరితో కలిసి అన్వేషణ కొనసాగిస్తామని తెలిపింది. ముంబైలో తమ మూలాలను కనుగొంటామనే ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే దత్తత తీసుకున్న డచ్ తల్లిదండ్రులతో తమకు ఎటువంటి ఇబ్బందులూ లేవని అనిస్ ఈ సందర్భంగా పేర్కొంది.