విషజ్వరంతో ఇద్దరు మృతి
అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు): జిల్లాలో విషజ్వరంతో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో సోమవారం రేగండ్ల నాగమణి(27) జ్వరంతో మృతి చెందింది. మృతురాలికి భర్త, ఒకరు సంతానం ఉన్నారు. మూడు రోజుల కిందట ఆమెకు జ్వరం రాగా మొదట స్థానికంగాను, ఆ తర్వాత ఖమ్మంలో వైద్య సేవలు అందించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. డెంగీ లక్షణాలతో ప్లేట్లెట్స్ తగ్గి ఒకరు మృతి చెందటంతోపాటు గ్రామానికి చెందిన మరికొందరు జ్వరాలతో బాధపడుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రుద్రవరంలో మరొకరు..
రుద్రవరం(రెడ్డిగూడెం): రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాలో విష జ్వరంతో మరొకరు మృతి చెందారు. గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. గ్రామానికి చెందిన బాణావాత్ సోని మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆమె వైద్య సేవలు పొందింది. ఆదివారం రాత్రి జ్వరంతోపాటు బీపీ, షుగర్ పెరగడంతో తీవ్ర అస్వస్తతకు గురైంది. మైలవరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. గ్రామంలో మృతుల సంఖ్య పెరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కన బర్చి జ్వరాల నియంత్రణకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.