నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు
అత్త, మామ, ఆడపడుచు, ఆడపడుచు భర్తే కారణం
హోటల్లో శ్రీరామ్ మృతిపై అతని భార్య అనిల ఆరోపణ
గాంధీనగర్ : తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని ఇటీవల ఓ హోటల్లో మృతి చెందిన వీరగంధం శ్రీరామ్ భార్య అనిల పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. గుడివాడకు చెందిన తనకు 2004లో శ్రీరామ్‌తో వివాహమైందని, పదేళ్లుగా అమెరికాలో జీవిస్తున్నామని, పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకుందామని అనుకున్నామని చెప్పారు. అయితే శ్రీరామ్ తల్లిదండ్రులు, అక్క, బావ నిరాకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 18న తాను, డిసెంబర్ 4న శ్రీరామ్ భారత్ వచ్చామని తెలిపారు. డిసెం బర్ 16న పెళ్లి రోజు జరుపుకొన్నామని చెప్పారు. జనవరిలో శ్రీరామ్ అమెరికా వెళ్లి, అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడాడని, అయితే ఈ నెల 10వ తేదీన గాంధీనగర్‌లోని ఓ హోటల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ద్వారా తెలిసిందని, తిరిగి ఎప్పు డొచ్చాడో తనకు తెలియదని రోధించారు.
తన భర్త ఇండియాతో పాటు అమెరికాలోనూ ఆస్తులు సంపాదించారని, పిల్లలను దత్తత తీసుకుంటే ఆస్తులు వారికి దక్కుతాయనే ఉద్దేశంతోనే తన మామ వీరగంధం కామేశ్వరరావు, అత్త ఇందిర, ఆడపడుచు గౌతమి, ఆమె భర్త శ్రీధర్ తన భర్తను మానసికంగా హింసించారని ఆరోపించారు. తన భర్త మరణించిన హోటల్లో రెండు జతల దుస్తులే లభించాయని చెబుతున్నారని, పాస్‌పోర్టు, వీసా, ఐఫోన్ ఏమయ్యాయని ప్రశ్నిం చారు. అనిల తండ్రి పర్వతనేని నాగమోహనరావు మాట్లాడుతూ శ్రీరామ్ పేరుతో ఉన్న ఆస్తులను డిసెంబర్లోనే అతని తల్లిదండ్రులు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ విషయం తన అల్లుడు మృతి చెందాక తెలి సిందని అన్నారు. సమగ్ర దర్యాప్తుచేసి తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరారు.