Animal skins
-
తోలు తీసి.. నదిని దాటేసి.. ఏ కాలం నుంచి మొదలు?
వాగులు, వంకలు దాటేందుకు ఇప్పుడంటే పడవలు, బోట్లు ఉన్నాయి. సముద్రాలను కూడా అలవోకగా దాటేస్తున్నాం. ఇవన్నీ ఎందుకనుకుంటే పెద్ద పెద్ద వంతెనలే కట్టుకుంటున్నాం. మరి ఇలాంటి సౌకర్యాలేవీ లేని పూర్వకాలంలో కొన్ని ప్రాంతాల్లో వాగులు, నదులను ఎలా దాటే వాళ్లో తెలుసా? చనిపోయిన జంతువుల కళేబరాలను ఒలిచి, వాటిలో గాలిని ఊది బెలూన్లలా చేసుకొని వాడేవారు. వినడానికి విచిత్రంగా ఉన్నా అప్పట్లో ఇలాగే చేసేవారు. అసలు రంధ్రాలు పడకుండా జంతువుల కళేబరాలను పక్కాగా ఎలా ఒలిచేవాళ్లు, వాటి నుంచి గాలి పోకుండా ఏం చేసేవాళ్లు, కదిలే నీటిలో వాటితో ఎలా ప్రయాణించే వాళ్లు, ఇలాంటి పద్ధతులు ఏ ప్రాంతాల్లో వాడేవారో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఏ కాలం నుంచి మొదలు? ఆదిమ కాలం నాటి ఈ నదులు దాటే పద్ధతి మెసపటోమియా కాలం నుంచి కనిపిస్తోంది. క్రీస్తుపూర్వం 880ల కాలంలో నిర్ముడ్ ప్రాంతంలోని (ప్రస్తుతం ఇరాక్‌లో ఉంది) ఓ శిల్పంలో ఈ విధానం గురించి చెక్కారు. అప్పటి ఆ ప్రాంతపు అస్సీరియన్ సైనికులు గాలి నింపిన మేక ఆకారంలోని జంతు చర్మాల సాయంతో వాగును దాటుతున్నట్టు ఆ శిల్పంలో ఉంది. అప్పట్లో గ్రీకు రాజు సైరస్ కూడా ఇలాంటి జంతు చర్మాల సాయంతో బాబిలోనియన్ నదిని దాటాడని నాటి తత్వవేత్త జెనోఫోన్ చెప్పాడు. పర్షియా రాజు డేరియస్, మంగోలియన్ సైనికులు, రోమన్లు, అరబ్బులు కూడా ఈ పద్ధతి వాడారు. చర్మాలను ఎలా ఒలిచేవాళ్లు? ఓ ప్రత్యేక పద్ధతిలో జంతువుల చర్మాలను ఒలిచేవారు. ఆ తర్వాత చర్మాన్ని కొన్నిరోజులు పాతి పెట్టేవారు. తర్వాత దానిని తీసి పదును లేని కత్తితో రాసి వెంట్రుకలను తొలిగించేవారు. ఆ తర్వాత చర్మాన్ని తిప్పి లోపలి భాగంవైపు ముక్కు, మూతి, కళ్లు, చెవులు లాంటి ఇతర రంధ్రాలుండే ప్రాంతాలను కుట్టేసేవారు.4 కాళ్లలో మూడింటిని కట్టేసేవారు. నాలుగో కాలును గాలి ఊదేందుకు, తీసేందుకు వాడేవారు. చర్మంలోపల తారు లాంటి పదార్థాన్ని పోసి పూర్తిగా అంటుకునేవరకు ఊపేవారు. వాడనప్పుడు తోలును ఎండబెట్టి ఉంచేవారు. వాడాలనుకున్నప్పుడు తోలుకు సున్నితత్వాన్ని పెంచడానికి నీళ్లలో నానబెట్టేవారు. నదులను ఎలా దాటేవాళ్లు? చర్మం బెలూన్‌లో గాలి ఊదాక తమకు తాముగా ఆ బెలూన్‌తో పాటు నదిలో దూకేవారు. ఒకవైపు కాలుతో, మరోవైపు చిన్న తెడ్డుతో నీటిని వెనక్కి తోస్తూ ముందుకెళ్లేవారు. జంతు చర్మం బెలూన్ మాములూగానే గుండ్రంగా ఉంటుంది. దూకగానే పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే సాధన చేస్తూ చేస్తూ ఆ చర్మం బెలూన్ సాయంతో ఈదడం నేర్చుకునేవారు. వీటిపైన ఇతర ప్రయాణికులను, చిన్న చిన్న వస్తువులు, సరుకును కూడా రవాణా చేసేవారు. ప్రయాణికులను తీసుకెళ్లేటప్పుడు రెండు, మూడు చర్మం బెలూన్లను ఒక చిన్న సైజు తెప్పలా చేసి వాడేవారు. మనదేశంలో వాడేవాళ్లా? మనదేశంలోనూ పంజాబ్, కశ్మీర్, సిమ్లాల్లో ఇలాంటి వాటిని వాడేవారు. 1900వ సంవత్సరం తొలినాళ్లలో అమెరికా స్కూల్ టీచర్ జేమ్స్ రికాల్టన్ మన దేశాన్ని చూసేందుకు వచ్చినప్పుడు పంజాబ్‌లోని కొండ ప్రాంత గ్రామాల్లో జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని గ్రామస్తులు దాటడం గమనించాడు. ఆ దృశ్యాలను తన స్టీరియోస్కోపిక్ కెమెరాలో బంధించాడు. సరుకులనూ నది దాటించేవాళ్లా? సరుకు రవాణాకూ ఈ జంతు చర్మాల బెలూన్లను వాడేవారు. ఇంగ్లిష్ అన్వేషకుడు విలియం మూర్‌క్రాఫ్ట్ మన దేశానికి వచ్చినప్పుడు తనకు సంబంధించిన వ్యక్తులు 300 మంది, 16 గుర్రాలు, కంచర గాడిదలు, దాదాపు 7,400 కిలోల వివిధ రకాల బ్యాగులను 31 మంది తమ జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని దాటించారని చెప్పాడు. ఈ పనినంతా వాళ్లు కేవలం గంటన్నరలోనే పూర్తి చేశారన్నాడు. చైనా వాళ్లు కూడా ఇలాంటి జంతు చర్మాలతో చేసిన తెప్పలపై రకరకాల సరుకులను రవాణా చేసేవారు. -
సందు దొరికితే సంపుడే..!
మహదేవపూర్ అడవుల్లో జోరుగా వేట ⇒ హైదరాబాద్ నుంచి వస్తున్న బడాబాబులు ⇒ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న స్థానిక ముఠా ⇒ విదేశాలకు జంతు చర్మాలు ⇒ గోదావరి తీరంలో షూటింగ్ రాకెట్ సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీరం వణ్యప్రాణుల వేటకు నిలయంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన బడాబాబులు తమ మృగయానం దం తీర్చుకునేందుకు మహదేవపూర్ అడవుల్లోకి షికారుకు వస్తున్నారు. ఇక్కడ వేటాడిన జంతువుల మాంసంతో నగరంలో దావత్‌లు చేసుకుంటున్నారు. జంతు చర్మాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెండేళ్లుగా ఈ తంతు పకడ్బందీగా కొనసాగుతోంది. మహదేవపూర్ రేంజ్ పరిధిలో ఆదివారం(19న) రాత్రి ఫారెస్టు అధికారులు జరిపిన దాడిలో హైదరాబాద్‌కు చెంది న కారు, రెండు జింకల మృతదేహాలు లభిం చడంతో వేట ఇక్కడ సర్వసాధారణం అన్న అంశం తెరపైకి వచ్చింది. గతంలో ఉచ్చులు, కరెంటు తీగలు అమర్చడం ద్వారా అటవీ జంతువులను వేటాడేవారు. ఇలా వేటాడిన జంతువుల మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకునేవారు. కరెంటు తీగలు అమర్చడం వల్ల స్థానికులు మరణిస్తుండటంతో కొన్నేళ్లుగా కరెంటు తీగలు, ఉచ్చులతో వేటాడటం తగ్గుముఖం పడుతోంది. దీని స్థానంలోకి తుపాకులు, జిప్సీలు, బైనాక్యులర్స్ ఉపయోగిస్తూ వేటాడేవారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌లో హై–ఫై సర్కిళ్లకు వన్యప్రాణుల మాంసాన్ని సరఫరా చేసే ముఠాల సంచారం పెరిగింది. స్థానికంగా ఉండే వారు వీరికి సహకారిస్తూ ఒక రాకెట్‌గా ఏర్పడ్డారు. ఫలితంగా అడవి జంతువులు బలవుతున్నాయి. ముందస్తు సమాచారం మహదేవపూర్, పలిమెల మండలాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నాయి. ఈ రెండు మండలాల పరిధిలోనే ప్రాణహిత, ఇంద్రావతి నదులు గోదావరిలో కలుస్తున్నాయి. దట్టమైన అడవితో పాటు జంతువులు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ మావోయిస్టులు, పోలీసుల సంచారం ఎక్కువగా ఉంటుంది. మావోయిస్టులు, పోలీసుల కూంబింగ్‌లు జరగని రోజులను వేటగాళ్లు ఎంపిక చేసుకుంటున్నారు. వేటగాళ్ల ముఠాకు సహకరించేందుకు స్థానికంగా అధికార పార్టీకి చెందిన ఓ నేత ఆధ్వర్యంలో పదిహేను మందితో కూడిన ప్రత్యేక దళం పని చేస్తున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. పెద్ద బండ్లు కాళేశ్వరంలో దైవదర్శనానికి వచ్చే భక్తులు మినçహా మహదేవపూర్ మండలంలోకి పెద్ద పెద్ద కార్లు వచ్చే సందర్భాలు అరుదు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భం గా వాహనాల రాక పెరిగినా అనుమానాస్ప దంగా తిరిగే కార్ల సంఖ్య అధికమైనట్లు తెలుస్తోంది. మహదేవపూర్–పలిమెల మార్గంలోకి ఫార్చునర్, ఇన్నోవా వంటి కార్లు అకస్మాత్తుగా రావడం రోడ్డు పక్కన అడవుల్లో గంటల తరబడి పార్కింగ్ చేసి ఉండటాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అలాగే, వేటకు అనువుగా ఉండే జిప్సీ, టాప్‌లెస్ జీపుల వినియోగం ఇటీవల ఈ ప్రాంతంలో పెరగడం జంతువుల వేట జోరుగా సాగుతోందన్న సందేహాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. లక్షల్లో వ్యాపారం.. హైదరాబాద్‌లో జరిగే పలు పార్టీల్లో అడవి జంతువుల మాంసాన్ని ప్రత్యేక ఆకర్షణగా పేర్కొంటున్నారు. ఇలాంటి పార్టీలకు మాంసం చేరవేసేందుకు పక్కా నెట్‌వర్క్‌తో పనిచేస్తున్నారు. దీంతో మహదేవపూర్ అడవుల్లో వేట వ్యవహారం కనీస జీవనోపాధి దశ నుంచి కార్పొరేట్ స్థాయికి చేరుకుంది. వేటలో లభించిన జంతువును బట్టి రేటును నిర్ణయిస్తున్నారు. జింక మాంసాన్ని కేజీకి వేలల్లో అమ్ముతున్నట్లు సమాచారం. లేదా సగటున 25 కేజీలు ఉండే జింక, దుప్పి వంటి జంతువులను చర్మంతో సహా టోకుగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. జంతు చర్మాలను హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.