జంతు సంక్షేమం కోసం బిపాసాబసు విరాళం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసాబసు తన జంతు ప్రేమను మరోసారి నిరూపించుకుంది. జంతు సంక్షేమం కోసం నిధులు సేకరిస్తున్న పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏనిమల్స్(పేటా) సంస్థ సభ్యులకు వేలం కోసం తాను సంతకం చేసి ఇచ్చిన ‘బీబీ లవ్ యువర్సెల్ఫ్’ టీ షర్ట్, రెండు ఫిట్నెస్ డీవీడీలను అందజేసింది. ఈ వస్తువులన్నీ ఈబే డాట్కామ్ ద్వారా వేలం వేయబడతాయి. ఈ నిధులు ఏనిమల్ రహత్ అనే స్వచ్ఛంద సంస్థకు చేరతాయి.
ఈ సందర్భంగా బిపాసా మాట్లాడుతూ..‘ నోరులేని జీవాలైన జంతువుల సంక్షేమానికి అహర్నిశలు పనిచేస్తున్న ఏనిమల్ రహత్కు మద్దతు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను..’ అని అన్నారు. ఏనిమల్ రహత్ సంస్థ మహారాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా గుర్రాలు, ఎడ్లు, గాడిదలతో బలవంతంగా పనిచేయించడాన్ని ఈ సంస్థ వ్యతిరేకిస్తోంది.