‘ఆడేపాడే తోల్బొమ్మ’
దర్శక నిర్మాత మెహర్‌ప్రసాద్
కాకినాడ కల్చరల్ :
వ్యాపార దృక్పథంతో కాక పూర్తి మానవతా విలువలతో ‘ఆడేపాడే తోల్బొమ్మ’ చిత్రాన్ని నిర్మించామని చిత్ర కథ, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకనిర్మాత మల్లిపూడి బాబా మెహర్‌ప్రసాద్ చెప్పారు. చిత్రం విడుదలను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక అంజలి థియేటర్ వద్ద చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా మెహర్‌ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ సినీ ప్రపంచంలో తొలిసారిగా మహిళలు మాత్రమే నటించిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు, యువతీ,యువకులకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నందునే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. మంచి మనసుతో నిస్వార్థంగా పనిచేసే వారికి ప్రజల్లో ఆదరణ మహావృక్షంలా పెరుగుతుందనే విషయాన్ని చిత్రంలో చూపించామన్నారు. మెహర్ బాబా క్రియేషన్స్ బ్యానర్‌పై మరిన్ని సందేశాత్మక చిత్రాలు నిర్మించనున్నామన్నారు. సంగీత దర్శకుడు ఎం.వెంకటేష్, నటులు ప్రవల్లిక, లావణ్య, కవిత, జానకి తదితరులు పాల్గొన్నారు.