వైభవంగా తొలి ఏకాదశి
వేములవాడ : వేములవాడ రాజన్న సన్నిధిలో శుక్రవారం ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. ఏర్పాట్లను ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, పీఆర్వో చంద్రశేఖర్ పరిశీలించారు. వేకువజామున 5 గంటల నుంచి అఖండ భజన కార్యక్రమం ప్రారంభమైంది. శనివారం ఉదయం వరకు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటు అధికారులు తెలిపారు.
కొండగట్టులో...
మల్యాల : తొలి ఏకాదశిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్నక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామి, శ్రీవేంకటేశ్వరస్వామి, అమ్మవారి మూలవిరాట్టులను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ ఈవో పరాంకుశం అమరేందర్, సూపరిండెంట్ సూర్యనారయణ శర్మ, సునీల్, శ్రీనివాస్, మారుతిరావు పాల్గొన్నారు.
కాళేశ్వరంలో..
కాళేశ్వరం : తొలి ఏకాదశిని పురస్కరించుకొని కాళేశ్వరం గోదావరి భక్తులతో కిటకిటలాడింది. నదిస్నానాల కోసం భక్తులు గోదావరి వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. గోదావరిలో ఇంటిల్లిపాది పుణ్యస్నానాలు ఆచరించి జలాలను వెంట తీసుకెళ్ళారు. ఆలయంలో శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ధర్మపురిలో..
ధర్మపురి : ధర్మపురిలో తొలి ఏకాదశి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించారు. గంగమ్మతల్లికి భక్తులు మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
మంథనిలో..
మంథని : తొలి ఏకాదశి సందర్భంగా మంథని వద్ద గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. వేకువజామునుంచే భక్తుల రాక మొదలైంది. మంథనితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలిరావడంతో గోదావరి రోడ్డు రద్దీగా మారింది. అరకిలో మీటర్ దూరంలో వాహనాలను నిలిపివేయడంతో భక్తులు కాలినడకన గోదావరికి చేరుకున్నారు.పుణ్యస్నానాల అనంతరం నదీతీరంలో ఆలయూలను దర్శించుకున్నారు.
పొట్లపల్లి ఆలయంలో...
హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి అలయంలో తొలి ఏకాదశి వేడులు శుక్రవారం ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో తర లివచ్చి స్వామివారిని దర్శించుకు ని, ప్రత్యేక పూజలు చేశారు. పూజారి రామకృష్ణశర్మ, అలయ కమిటీ నిర్వహకులు పాల్గొన్నారు.