ankalreddy
-
తాడిపత్రిలో ఆటవిక రాజ్యం
తాడిపత్రి: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కార్యకర్తలు బీజేపీ వారిపై చేసిన దాడికి నిరసనగా బీజేపీ, వీహెచ్‌పీ నేతలు బుధవారం స్థానిక వైఎస్సార్ సర్కిల్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ పోలీసు స్టేషన్ చేరుకోగానే పోలీసులు స్టేషన్ గేట్లు మూసివేశారు. దీంతో బీజేపీ, వీహెచ్‌పీ నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఎస్ఐ రాఘవరెడ్డి జోక్యం చేసుకుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, శింగరి లక్ష్మీనారాయణ, వీహెచ్‌పీ నాయకులు రాధాకృష్ణ మరి కొంతమందిని పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించారు. ఈ సందర్భంగా అంకాల్‌రెడ్డి పట్టణ సీఐ సురేందర్‌రెడ్డితో మాట్లాడారు. తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలపైనే కేసులు బనాయించడం అన్యాయమన్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా..?లేదా అని ప్రశ్నించారు. అయితే అందుకు సమాధానం చెప్పని సీఐ సురేందర్‌రెడ్డి... 30 యాక్ట్ అమల్లో ఉన్నందున పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేయడానికి వీల్లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తామన్నారు. అయితే గతంలో పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకుని వచ్చి పోలీసులపైనే దుర్భాషలాడిన అధికార పార్టీ నేతలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని అంకాల్‌రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీకి నిబంధనలు వర్తించవా..? అని ప్రశ్నించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అంకాల్‌రెడ్డి పోలీసుల తీరును నిరసించారు. స్థానిక పోలీసులందరూ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నారనీ, అందువల్లే బాధితులైన బీజేపీ నేతలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తాడిపత్రి పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తాడిపత్రి పోలీసుల తీరుపై డీజీపీకి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. -
కరువు నివారణకు శాశ్వత చర్యలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలో కరువు నివారణకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బుధవారం నగర ప్రెస్‌క్లబ్‌లో గోపాల్‌రావు ఠాగూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో సిక్కిం మాజీ గవర్నర్ గురించి ముద్రించిన ‘ఆదర్శ ప్రజాప్రతినిధి వి.రామారావు’ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్కాకర్ల రంగయ్య, స్మారక సమితి సభ్యులు కరణాకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ‘అనంత కరువు– పరిష్కరాలు’ అనే అంశంపై విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో తాగునీటికి సైతం కటకటలాడాల్సిన దుర్భర పరిస్థితులు ఉన్నాయన్నారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట నిల్వ చేసుకోవడానికి గోదాములు నిర్మాణం, పశుగ్రాసం, పశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు, రాయదుర్గం నియోజకవర్గంలో ఎడారిఛాయల నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు లక్ష్మిదేవమ్మ, శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర పాల్గొన్నారు.