నేటి నుంచి విజయదుర్గాపీఠం వార్షికోత్సవాలు
వెదురుపాక (రాయవరం) :
వెదురుపాక విజయదుర్గా పీఠం 44వ వార్షికోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబీ) సోమవారం తెలిపారు. 1972 ఆగస్టు 18వ తేదీన పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) మంత్రోపదేశం పొందారన్నారు. 1989 ఆగస్టు 16న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీతీర్థ స్వామి శ్రీ విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేసి, భవానీ శంకర స్ఫటిక బాణాన్ని విజయదుర్గాదేవి సన్నిధిలో ప్రతిష్ఠించారన్నారు. అమ్మవారికి పీఠంలో నిరంతరాయంగా పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక కార్యక్రమాలు
సర్వతో భద్రతా మండప ఆవాహనతో మంగళవారం ఉదయం 8.05 గంటలకు పూజలు ప్రారంభమవుతాయని బాబీ చెప్పారు. అనంతరం తమిళనాడు తిరుత్తణిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆస్థాన పండితులచేత కాలసర్ప, కుజగ్రహ దోష నివారణార్థం శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం నిర్వహించనున్నట్లు వివరించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి శాంతికల్యాణం జరుగుతుందన్నారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీరామచంద్రమూర్తికి సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు ఆలయ పండితులచేత దివ్య కల్యాణం జరుగుతుందని చెప్పారు. 18వ తేదీ ఉదయం 9.16 గంటలకు శ్రీ విజయదుర్గా అమ్మవారి నవావరణ హోమం, సాయంత్రం 6 గంటలకు తిరుమల శ్రీ వైఖానస ఆగమ పండితులచే శ్రీ భూ సహిత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు బాబీ తెలిపారు.