మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలి
ఏఎన్ఎంల వర్కషాప్లో కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ:
జిల్లాలో మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ఏఎన్ఎంలు పనిచేయాలని, ఈ మేరకు వృత్తిపరమైన మెళకువలు నేర్చుకుని సేవలు అందించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కాకినాడ, పెద్దాపురం డివిజన్లలోని ఏఎన్ఎంలకు శుక్రవారం రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎన్ఎంలు వారి పరిధిలో ఉన్న గర్భిణులందరూ రిజిస్టర్ అయ్యేలా చూడాలని, వీరికి ప్రాథమికంగా నిర్వహించాల్సిన వైద్య పరీక్షలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న 118 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 29 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 7 ఏరియా ఆసుపత్రులు, రెండు జిల్లా ఆసుపత్రుల ద్వారా మాతా శిశు సంరక్షణ పూర్తిస్థాయిలో జరగాలన్నారు. 48 శాతం మాత్రమే ప్రభుత్వాసుపత్రిలలో ప్రసవాలు జరుగుతున్నాయని ప్రభుత్వాసుపత్రులలో కల్పించే సదుపాయాలపై అవగాహన కల్పించి వీటిని పెంచాలన్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి శిశు జననాలకు 34 శిశు మరణాల రేటు నమోదవుతోందని, అదేవిధంగా ప్రతి లక్షమంది ప్రసవాలలో 74 మంది మహిళల మరణాలు నమోదవుతున్నాయని ఈ మరణాలపై జిల్లాస్థాయి కమిటీ చేసిన అధ్యయనం ద్వారా ముందు జాగ్రత్తలు తీసుకుంటే తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎం హెచ్ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్, ఎన్హెచ్ఎం డీపీఎంఓ డాక్టర్ సత్యనారాయణ, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎన్.రాజేశ్వరి, డీఐఓ డాక్టర్ అనిత, డీపీఆర్వో ఎం.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.