అన్నమయ్య కాలిబాటపై టీటీడీ నిర్లక్ష్యం!
రాజంపేట: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32 వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తుడిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలిబాటపై తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడవ ఘాట్‌రోడ్డు పరిశీలనలో ఈ కాలిబాటను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్ ఉంది. గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి వినతిపత్రంను సమర్పించిన సంగతి తెలిసిందే. దాంతో టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా అప్పట్లో జారీ చేశారు. టీటీడీ పాలక మండలి కూడా తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.
కాలిబాట ఇలా..
శేషాచల అటవీ ప్రాంతంలో స్వామి పాదాల నుంచి ప్రారంభమైయ్య కాలిబాట అవ్వతాత గుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలకు, ఈతకాయల మండపం నుంచి గోగర్భంతీర్థం(తిరుమల)కు చేరుకుంటుంది. అలాగే ఈ మార్గంలో తుంబరకోన, పనసమాన కోన, వాగేటి కోన, కనివేటికోన సహా మెుత్తం రకరకాల ఇరవై కోనలు ఉన్నాయి. సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉండటం వలన రహదారి గుండా జనసంచారం లేకపోయినా అటవీశాఖ సిబ్బందికి ఉపయోగపడుతోంది.
శిథిలమైన కాలిబాట..
రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచివెళ్లిన కాలిబాట నేడు శిథిలమయ్యింది. వెయ్యేళ్ల క్రితం నుంచి ఉన్న రహదారి అభివృద్ధికి కోట్లాది రూపాయిల ఆదాయం కలిగివుండే టీటీడీ కనీసం కన్నెత్తిచూడలేదు. మవుండూరు–బాలపల్లె మధ్య స్వామి పాదాల నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు పాదాలు, అక్కడి కోనేరు, సత్రం కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక్కడి నుంచి మెుదలయ్యే కాలిబాటలో ఎన్నో ఆలయాలు, సత్రాలు, కోనలు కొలువుదీరి ఉన్నాయి. ఈ బాట ద్వారా వెయేళ్ల క్రితం నుంచి భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ కొండకు వెళుతూ వచ్చారు.
ఉత్తర భారతీయులకు అనుకూలం..
పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. రాను రాను నేటి కలియుగంలో తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు కొనసాగుతోంది. ఉత్తర భారతదేశం, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నధికి చేరుకునే పుణ్యపవిత్రమైన వూర్గం అన్నమయ్య కాలిబాట. తాళ్లపాకకు ప్రపంచ స్థాయిలో నేటికీ గుర్తింపు వస్తున్న తరుణంలో..అదే స్థాయిలో అన్నమయ్య కాలిబాటకు మోక్షం కలుగుతుందన్న భావనలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రభుత్వం, టీటీడీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తిరుమల ఘాట్‌రోడ్డు పరిస్థితితో మూడవ ఘాట్‌రోడ్డు పరిశీలనకు ఈ మార్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న భావన భక్తుల నుంచి వెలువడుతోంది.
నేడు ఆకేపాటి తిరుమల మహాపాదయాత్ర:
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి శనివారం తెల్లవారుజామున తిరుమల మహాపాదయాత్రను ఆకేపాడు ఆలయాల సముదాయం నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర రాజంపేట, రైల్వేకోడూరు మీదుగా కుక్కలదొడ్డి వరకు కొనసాగనున్నది. అక్కడి నుంచి అన్నమయ్య కాలిబాటలో తిరుమలకు చేరుకుంటారు.