కాళ్లు కాలుతున్నాయ్..
♦ వెక్కిరిస్తున్న పేదరికం.. చెప్పులకు నోచుకోని వైనం
♦ మండుటెండలో కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి
♦ దాతలు కరుణిస్తే వేసవి గండం నుంచి ఉపశమనం
బాలాజీ అనే విద్యార్థి ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి తండ్రి మరణించడంతో తల్లి వెంట్రుకల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పేదరికం కారణంగా చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు. గోపవరం పంచాయతీ పరిధిలోని కాలువకట్ట నుంచి రోజు నాలుగు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వచ్చి వెళుతున్నాడు. మండు వేసవిలో తలపై టోపీ/గొడుగు లేనిదే బయటకు రాలేని స్థితిలో ఈ విద్యార్థి కాళ్లకు చెప్పులు లేకుండా వస్తుండటం దయనీయం. ‘ఎండాకాం వచ్చింది.. కాళ్లు కాలుతున్నాయి.. కొంచెం దూరం పరుగెత్తి నీడలో ఆగుతా.. మళ్లీ పరుగెత్తి.. మళ్లీ ఆగుతా.. ఇది నాకు అలవాటే’ అంటున్నాడు బాలాజీ.
మరో విద్యార్థి పేరు రామాంజనేయులు. ఇదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. తండ్రి మరణించగా తల్లి నాగలక్ష్మి సున్నపు బట్టీలో పనికి వెళుతోంది. రామాంజనేయులు సోదరుడు శివరామయ్య మరో పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా చెల్లెలు అరుణకుమారి వైవీఎస్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఆర్థిక లేమి కారణంగా రామాంజనేయులకు తల్లి చెప్పులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో మండుటెండలకు పాఠశాలకు కాలువకట్ట నుంచి నడిచి వస్తున్నాడు.
ప్రొద్దుటూరు :జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అత్యధికులకు కాళ్లకు చెప్పులు లేవంటే నమ్మితీరాల్సిన నిజం. పేదరికం కారణంగానే చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. దాదాపు సగం మంది విద్యార్థులు చెప్పులు లేకుండానే సమీప గ్రామాల నుంచి పాఠశాలలకు రోజూ వచ్చి వెళుతున్నారు. చలి, వర్షాకాలంలో చెప్పులు లేకపోయినా పరవాలేదు కానీ వేసవిలో మాత్రం తప్పనిసరి. అయితే కుటుంబ పరిస్థితుల రీత్యా చాలా మంది పిల్లలకు చెప్పులు కొనిపెట్టే స్తోమత తల్లిదండ్రులకు లేదు. ఉదాహరణకు ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో మొత్తం 348 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 250 మంది కాళ్లకు చెప్పులు లేకుండా పాఠశాలకు వస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది.
ప్రస్తుతం 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్న తరుణంలో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఈ సమయంలో ఉదయం పాఠశాలకు వచ్చేందుకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా, తిరిగి ఇంటికెళ్లేప్పుడు చెప్పులు లేకపోవడంతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉదయం పూట ఉన్నందున మధ్యాహ్నం నుంచి పాఠశాలలు నడిచే పరిస్థితి ఉంటుంది. దీంతో విద్యార్థులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక్క ప్రొద్దుటూరు మండలంలోనే సుమారు 20కిపైగా ఉన్నత పాఠశాలలు నడుస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఈ సమస్యతో సతమతమవుతున్నారు. పేదరికం వల్ల తల్లిదండ్రులు ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లాలోని 3,269 ప్రభుత్వ పాఠశాలల్లో సగం వాటిలో ఈ సమస్య కనిపిస్తోంది. తమ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల్లో పాతిక శాతం మందికి చెప్పులుండటం లేదని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ దాతలు స్పందిస్తే విద్యార్థులు వేసవి గండం నుంచి గట్టెక్కుతారు.