హవ్వా! ఏంటిది?
* అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అసంపూర్తి పాఠశాల భవనం
* జూదం, మద్యం, వ్యభిచారాలకు కేంద్రంగా మారిన వైనం
* ఆరేళ్లుగా ముందుకు సాగని పనులు
జోగిపేట: అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో అసంపూర్తిగా ఉన్న బాలుర ఉన్నత పాఠశాల భవనం నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. గత ప్రభుత్వ పాలకులు ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నూతన భవనాన్ని నిర్మించేందుకు 2008-09లో పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం పనులను చేపట్టారు. రూ.కోటి నిధులతో ప్రారంభమైన భవనం నిధుల కొరతతో ముందుకు వెళ్లలేదనే చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనం స్థలంలో ఉన్న పాత పాఠశాల భవనంలో ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలోకి వెళ్లిన వారు ఉన్నారు.
ప్రస్తుతం ఆ స్థలం జూదం, వ్యభి చారం, మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారడంతో పూర్వ విద్యార్థులు, గ్రామ పురప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి అయ్యిందంటే చాలు మద్యపాన ప్రియులు అసంపూర్తిగా ఉన్న భవనంపై భాగంలో కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అంతే కా కుండా తాగిన మత్తులో ఖాళీ బాటిళ్లను రోడ్డుపైకి విసిరివేస్తూ యాగి చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండడంతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పట్టపగలే జూదం ఆడుతున్నారు. ఈ తతంగం అంతా ఆ ప్రాం తంలో నివసించే వారు నానా రకాలా ఇబ్బం దు లు పడుతున్నారు. మద్యం, జూదం, వ్యభిచారా న్ని కళ్లారా చూస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ ప్రాంత కాలనీ వాసు ల్లో నెలకొంది.
భవనాన్ని కమ్మేసిన ముళ్లపొదలు
సుమారు 6 ఏళ్లుగా భవన నిర్మాణం పనులు నిలిచిపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరగడంతో భవనం కింది భాగం కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో జూదరులు, మద్యపాన ప్రియులకు అనుకూలంగా ఏర్పడిందనే చెప్పవచ్చు. నగర పంచాయతీ అధికారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద అసంపూ ర్తి భవనంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు, విద్యావంతులు కోరుతున్నారు.