విశ్వాసులకు మరణభయం లేదు
ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు అనుచరులు ఈస్టరు ఆదివారమున క్రీస్తు పునరుత్థానమును గుర్తు చేసుకుంటారు. ఇది కనీసం క్రీ.శ. 110లో టర్కీలోని అంతియోక్లో కూడ జరుపుకొన్నట్లు తెలియబడుతున్నది. ఇది సాధారణంగా యూదుల పస్కాపండుగ అయిన తరువాత మొదటి ఆదివారమున జరుపుకుంటారు. అసలు ఈస్టరు ఉత్తర యూరోప్‌లో వసంత రుతువుకు సంబంధించిన పండుగ. క్రీస్తు పునరుత్థానమును ఈస్టరుతో సమానంగా ఎంచుట సరియైనదా, కాదా అనేది వేరే విషయం. కానీ, క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైన విషయం ప్రాధాన్యం. ఆయన మృతులలో నుంచి తిరిగి లేచాడనునది చరిత్రలో ఎంతో విభ్రాంతి కలిగించు సంఘటన. క్రీస్తు పునరుత్థాన సత్యం క్రైస్తవ సంఘమునకు పునాదిగా ఉన్నది.
క్రీస్తు పునరుత్థాన ప్రాముఖ్యత ఏమిటి?
బైబిల్ ప్రకారం మొదటిగా, క్రీస్తు పునరుత్థానం ద్వారా ఆయన దేవుని కుమారుడుగా ప్రకటింపబడ్డాడు (రోమా 1:4). ఆయన పునరుత్థానం క్రీస్తు దైవత్వమును నిరూపించుతున్నది.
రెండవదిగా, క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవనట్లైతే, ఆయన మరణించుట యందలి ఉద్దేశము విఫలమైనట్టు. ఆయన మానవులకు బదులుగా వారి పాప ప్రాయశ్చిత్తం చేయుటకు మరణించి తిరిగి లేవనట్లైతే, అందరిలాగే పాపిగా మరణించినట్లే. కానీ, క్రీస్తు తిరిగి లేచాడు. పాప ప్రాయశ్చిత్తం జరిగింది. పాపములకు క్షమాపణ కలదు.
మూడవదిగా, మరణం జీవితానికి అంతం కాదని ఆయన పునరుత్థానం బోధిస్తోంది. క్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా మానవుడు నిరంతరం జీవించగలడు. ఇది మానవులకు ఆయనిచ్చే నిరీక్షణ. ఆయన యందు విశ్వాసముంచిన వారికి మరణమంటే భయము లేదు.
నాల్గవదిగా, దేవుడు మనతో ఎల్లప్పుడు ఉంటాడు అనే నిశ్చయత క్రీస్తు పునరుత్థానం ద్వారా కలుగుతుంది. అందుకే యేసు తన శిష్యులతో ‘‘ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను’’ అని వాగ్దానం చేశాడు (మత్తయి 28:20).
చివరిగా, ఆయన పునరుత్థాన శక్తిచేత ఆయన జీవించినట్లు పవిత్రమైన, దీనమైన, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మనకు సహాయం చేస్తాడు. అందుకు ఆయన, ‘‘నేను జీవమిచ్చుటకును, మరియు సమృద్ధియైన జీవమిచ్చుటకును వచ్చియున్నాను’’ అని చెప్పాడు (యోహాను 10:10).
మీ జీవితాలలో క్రీస్తు పునరుత్థానములోని ప్రాముఖ్యత కనుగొని, జీవించునట్లు దేవుడు మిమ్మునాశీర్వదించును గాక!
- ఎర్రా