ఆంట్వన్ బ్లోయి
Antoine Bloye ఒక ఫ్రెంచి నవల. 1933లో అచ్చయింది. రచయిత పాల్ నైజాన్ (1905-40). ఇతడు జా పాల్ సార్త్‌క్రు సహాధ్యాయి. డన్కిర్క్ వద్ద జరిగిన యుద్ధంలో మరణించాడు.
1973లో మంత్లీ రివ్యూ ప్రెస్ వాళ్లు పునర్ముద్రించిన ఈ నవలను ఒక ఫర్గాటెన్ మాస్టర్‌పీస్ అంటారు మార్క్సిస్టు సాహిత్యకారులు. ఇది రాసినప్పుడు నైజాన్ ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడేగానీ నవలలో ఎక్కడా ప్రచారార్భాటమూ సైద్ధాంతిక చర్చా ఉండదు. ముక్కుకు మూదాడేసి (కనీసం నాకు) చదివించే కథనం పాఠకుడిని సుడిగుండంలా తనలోకి లాక్కుంటుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో కార్మికులు పరాయీకరణ చెందుతారన్నాడు మార్క్స్. సాధారణ రైల్వే ఉద్యోగి ఆంట్వన్ బ్లోయి తన తోటివారి నుండి క్రమంగా పరాయీకరణ చెందిన క్రమాన్ని అద్భుతంగా చిత్రించాడు పాల్ నైజాన్. తనలో మార్పు వచ్చిన విషయాన్ని కథానాయకుడు గుర్తించను కూడా లేడు. కానీ జీవితం నిస్సారమైందని తెలుస్తుందొకనాడు. మనుషుల్ని ప్రేమించే శక్తి తగ్గిపోతుంది.
గుజ్జు తీసిన పండులాగవుతుంది బతుకు. ఎందుకు ఉద్యోగంలో కొనసాగుతున్నాడో తెలియదు. కానీ ఇష్టంలేని ఉద్యోగం చెయ్యకుండా ఉండలేడు.నవలలో భాష గణితమంత కచ్చితంగా ఉంటుంది. ‘‘రోజు తర్వాత రోజు, రాత్రి తర్వాత రాత్రి తన జీవితం కొనసాగించాడు ఆంట్వన్. రసం తీసిన పిప్పిగా మారతాడు. కానీ అందులో ఒక సుఖమున్నది. సాంత్వననూ అనుభవించాడు. అందువల్ల ఎప్పుడూ ప్రతిఘటించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ‘‘ఇల్లున్నది. చక్కటి లావుపాటి భార్యున్నది. పిల్లలు ఎదిగారు. త్వరలో వాళ్లూ ఓ ఇంటివాళ్లవుతారు. వృద్ధాప్యంలో జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది’’ అని తనను తాను నమ్మించుకుంటాడతను. కార్మికుడిగా ప్రారంభించిన బ్లోయి పెటీ బూర్జువాగా పరిణామం చెందుతాడు. మేనేజిమెంటుతో లాలూచీ పడతాడు. యజమాని కూతుర్ని పెళ్లి చేసుకొని తాను అధికారవర్గంలో చేరిపోయాననుకుంటాడు.
‘‘బ్లోయి మరెవరో కాదు. నువ్వే’’ అని పలుమార్లు పాఠకుడ్ని హెచ్చరిస్తాడు నైజాన్. రచయిత కొన్ని సార్లు అతడి గురించి వ్యంగ్యంగా రాసినా, జీవితానందాన్ని ఆవిరి చేసుకున్న బ్లోయిని చూస్తే మనకు విషాదనాయకుడే గుర్తుకువస్తాడు. నిస్సందేహంగా ఇది మార్క్సిస్టు నవలే. వ్యాఖ్యానించినప్పుడు మార్క్సిస్టు పరిభాష కూడా కనిపిస్తుంది. ‘‘తాత్వికత అంటే జీవితాన్ని యథాతథంగా అంగీకరించడం కాదు. దాన్ని మార్చే ప్రయత్నం చేయటమని బ్లోయి గ్రహించలేదు’’ అంటాడు నైజాన్.ఈ పుస్తకం నాకు దొరకడం కేవలం యాదృచ్ఛికం. కొన్నాళ్ల క్రితం దేశంకాని దేశంలో పుస్తకాల వేట కొనసాగిస్తున్నప్పుడు, పాత పుస్తకాల షాపులో ఓ మూలన నక్కివుంది. అప్పటికి నాకు రచయిత గురించిగానీ, పుస్తకం గురించిగానీ ఏమీ తెలియదు. మంత్లీ రివ్యూ ప్రెస్ వాళ్ల ప్రచురణ కావడం వల్ల హస్తభూషణంగా ఉంటుందనీ, చవకగా వచ్చిందనీ తీసుకున్నాను. కానీ చదవడం ప్రారంభించాక మధ్యలో ఆపలేకపోయాను. మన జీవితాల్ని మైక్రోస్కోపు కింద పెట్టి పరీక్షించాడీ రచయిత అనిపించింది.డాన్ కిహోటీ, మృతజీవులు, అన్నా కరేనినా, హకల్ బెరీఫిన్, సింగర్ కథలు వగైరా పుస్తకాలను ఎప్పుడైనా, ఎక్కడైనా చదవడానికి అనువుగా ఉంటాయని అందుబాటులో పెట్టుకుంటాను. ఇప్పుడు వాటి సరసన చేరింది ఆంట్వన్ బ్లోయి.
ముక్తవరం పార్థసారథి