నేడు ఏఎన్‌యూ పాలకమండలి సమావేశం
కీలక అంశాలపై నిర్ణయం
ఏఎన్‌యూలో చర్చకు రానున్న క్యాస్ పదోన్నతుల అంశం
పీజీ పరీక్షల కోఆర్డినేటర్ మార్పు!
ఏఎన్‌యూ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పాలకమండలి సమావేశం బుధవారం జరగనుంది. వీసీ ఆచార్య ఎ. రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యూనివర్సిటీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. యూనివర్సిటీలో చేపట్టనున్న పలు నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, పరిశోధన, అవగాహనా ఒప్పందాల అంశాలు చర్చకు రానున్నాయి.
కమిటీల నివేదికలపై నిర్ణయం?
యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షల విధుల్లో పాల్గొంటున్న ఒక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్కులు వేయిస్తానని చెప్పి విద్యార్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తుకు వీసీ యూనివర్సిటీ అధికారులతో త్రిసభ్య కమిటీని నియమించారు.
ఆ కమిటీ నివేదికను సమర్పించింది. దీనిపై పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ఇటీవల యూనివర్సిటీలో చోటు చేసుకున్న పలు ఘటనలపై నియమించిన కమిటీల నివేదికలు కూడా పాలకమండలి పరిశీలన కోసం ఎదురు చూస్తున్నాయి.
క్యాస్ పదోన్నతులు..
యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా క్యాస్ పదోన్నతులు కల్పించేందుకు ఉన్నతాధికారులు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ల రికమెండేషన్లను పరిశీలించి దాని ఆధారంగా క్యాస్ పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై పాలక మండలి ఏం నిర్ణయం తీసుకుంటుందోనని అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు యూనివర్సిటీ పీజీ పరీక్షల కోఆర్డినేటర్ పదవి మార్పు జరిగే అవకాశం ఉంది.
ఈ పదవి కోసం పలువురు అశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. యూనివర్సిటీ రెగ్యులర్, దూరవిద్య పరీక్ష విభాగంలో గతంలో కీలక విధులు నిర్వహించిన సైన్స్ కళాశాలకు చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఈ పదవి ఖరారైనట్లు సమాచారం. దీంతోపాటు యూజీ పరీక్షల కోఆర్డినేటర్ పదవికి కూడా గడువు తీరినప్పటికీ ప్రస్తుతం ఉన్న కోఆర్డినేటర్నే కొనసాగిస్తారా లేక కొత్తవారిని నియమిస్తారా అనే దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు పలు కీలక అంశాలను పాలకమండలి పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.