అనూహ్య హత్య కేసు విచారణ వాయిదా
సాక్షి ముంబై: సంచలనం సృష్టించిన విజయవాడ యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసుపై శనివారం ప్రభుత్వ న్యాయవాది తుది వాదనలు వినిపించారు. అనంతరం సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.వి.జోషి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు.
2014 జనవరి 5న లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినల్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16న కంజూర్‌మార్గ్-భాండూప్ మధ్యలో శవమై తేలిన సంగతి తెలిసిందే. కేసు విషయమై ఇప్పటి వరకు ప్రభుత్వ న్యాయవాది 39 మంది సాక్షుల్ని ప్రవేశపెట్టగా డిఫెన్స్ న్యాయవాది ఐదుగురు సాక్షుల్ని ప్రవేశపెట్టారు. శనివారం వాదనలు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వ న్యాయవాది రాజన్ ఠాక్రే తన వాదనను వినిపిస్తూ నిందితుడు చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాను దోషిగా ప్రకటించేందుకు అన్ని రుజువులు ప్రవేశపెట్టామన్నారు. రైల్వేస్టేషన్లో అనూహ్యతో కలసి బయటికి నడుస్తున్న సీసీటీవీ ఫుటేజ్ తోపాటు ఆమెకు సంబంధించిన వస్తువులను నిందితుని వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం న్యాయమూర్తి వీవీ జోషి విచారణ ఈ నెల 8కి వాయిదా వేశారు. తమ వాదనలను ఈనెల 8న వినిపించనున్నట్లు చెప్పారు. నిందితుడు చంద్రాబాన్‌ను 2014 మార్చి 2న అదుపులోకి తీసుకున్న పోలీసులు 85 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేశారు.
దోషులను కఠినంగా శిక్షించాలి: ముంబై వైఎస్సార్సీపీ నేత మాదిరెడ్డి కొండారెడ్డి
ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి. ఈ విషయంపై గతంలో కూడా దివంగత గోపీనాథ్ ముండేతో భేటీ అయ్యాం. న్యాయస్థానంపై నమ్మకం ఉంది. దోషికి కఠిన శిక్ష విధిస్తారని విశ్వసిస్తున్నా.