పిల్లల స్టేషనరీ మార్కెట్‌పై షాచిహాత దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టేషనరీ వ్యాపారంపై జపాన్‌కు చెందిన షాచిహాత దృష్టిసారించింది. ‘ఆర్ట్‌లైన్’ బ్రాండ్ నేమ్‌తో పెన్నులు, పెన్సిల్స్, కలరింగ్, క్రేయాన్స్‌లతో పాటు ఆఫీస్ స్టేషనరీ వస్తువులను అందిస్తున్నట్లు షాచిహాత తెలిపింది. ఇప్పటికే చెన్నైలో ఉన్న యూనిట్‌తో పాటు, గోవా, ఉత్తరాది రాష్ట్రాల్లో మరో రెండు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు షాచిహాత ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అనూప్ రాణా తెలిపారు. కొత్త యూనిట్లు, డీలర్ల ఏర్పాటు కోసం రానున్న రెండేళ్లలో రూ. 30 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాణా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
దేశీయ స్టేషనరీ వ్యాపారం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ ప్రస్తుతం రూ.12,000 కోట్లుగా ఉందని, ఇందులో పుస్తకాలు మినహా మిగిలిన వ్యాపారం విలువ సుమారు రూ.4,000 కోట్లుగా ఉందన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల స్టేషనరీకి, క్రేయాన్స్, కలరింగ్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని, ఇందులో దక్షిణ భారతదేశం ముందంజలో ఉందన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను 70 నుంచి 200కి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.200 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
జపాన్‌తో పోలిస్తే ఇక్కడ తయారీ వల్ల 25 శాతం వ్యయం కలిసొస్తుందని, అందుకనే ఇక్కడ నుంచే మిగిలిన దేశాలకు కూడా ఎగుమతులు చేయనున్నట్లు రాణా వివరించారు. ఈ రూ. 200 కోట్ల ఆదాయంలో 40 శాతం ఎగుమతుల నుంచే వస్తుందన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశీయ స్టేషనరీ మార్కెట్లో 15 శాతం వాటాను కైవసం చేసుకోవాలన్నది షాచిహాత లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాణా తెలిపారు.