బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్‌లు ఉచితం
న్యూఢిల్లీ: పండుగల సీజన్ సందర్భంగా ప్రముఖ మొబైల్ ఆపరేటర్, బీఎస్ఎన్ఎల్ పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, ఆదాయం 6 నుంచి 7 శాతం పెంచుకోవడం లక్ష్యంగా ఈ పండుగ ఆఫర్లనందిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ డెరైక్టర్(కన్సూమర్ మొబిలిటి) అనుపమ్ శ్రీవాత్సవ వివరించారు. తాము అందిస్తున్న వివిధ ఆఫర్ల కారణంగా ఇప్పటికే తమ ఆదాయం ఏనెలకానెల 5 శాతం పెరుగుతోందని వివరించారు.
ఇది తమకు 13వ వార్షికోత్సవమని, అందుకనే ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకూ కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారి కోసం సిమ్ కార్డ్‌లను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.100-199ల ఫుల్ టాక్ టైమ్ టాపప్ ఓచర్లను అందిస్తున్నామని, వీటి వ్యాలిడిటీ 15 రోజులని వివరించారు. ఈ టాపప్ ఓచర్లను ఈ నెల 1 నుంచి మరో మూడు నెలల పాటు అందిస్తామని పేర్కొన్నారు. రూ.98 అంతకు మించి స్పెషల్ టారిఫ్ ఓచర్లకు 10 శాతం అదనపు డేటాను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలి పారు. ఇలాంటి మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను భవిష్యత్తులో కూడా అందించనున్నామని వివరించారు. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే చివరినాటికి బీఎస్ఎన్ఎల్కు 9.71 కోట్ల మంది మొబైల్ వినియోగదారులతో 14.56 శాతం మార్కెట్ వాటా ఉంది. 2011-12 నాటికి రూ.8,851 కోట్లుగా ఉన్న కంపెనీ నష్టం 2012-13లో రూ.8,198 కోట్లకు తగ్గింది.