ఏపీఈఆర్సీ ఆదేశాలు అమలయ్యేలా చూడండి
కేంద్రానికి తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు అమల్లో ఉన్నట్టేనన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖకు తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభ జన అనంతరం ఆరు నెలలపాటు ఏపీఈఆర్సీనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటుందని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్సీ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఏపీ మాత్రం ఏపీఈఆర్సీని గుర్తించబోమని, ఆ ఆదేశాలు తాము పాటించమని పేర్కొంటోందని ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార శైలి విభజన చట్టానికి భిన్నంగా ఉందని వివరించారు. అందువల్ల ఏపీఈఆర్సీ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణకు 53.89 శాతం విద్యుత్తు వచ్చేలా చూడాలని కోరారు. తెలంగాణలో విద్యుత్తు కోతల అంశాన్ని ఈ లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.