‘బంగారు తల్లి’కి కష్టాలు
లబ్ధిదారుల ఖాతాల్లో పడని నగదు
ఏపీజీబీ అకౌంట్లు ఇచ్చిన వారికి ఆన్లైన్ సమస్యలు
పెండింగ్‌లో వందలాది దరఖాస్తులు
బేస్తవారిపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్న తల్లులు నగదు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన వారికి 2013 మే నుంచి పథకాన్ని ప్రారంభించారు. వైద్యశాలలో బిడ్డ జన్మించినట్లు ధ్రువీకరణ పత్రం అందజేయగానే బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేయాలి. అప్పటి నుంచి కష్టాలు
మొదటి ఏడాదికి వెయ్యి, 3,4,5 సంవత్సరాలకు ఏటా రూ. 1500, 6-10 సంవత్సరాలకు ఏడాదికి రూ. 2 వేలు, 11 నుంచి 13 ఏళ్ల వరకు ఏడాదికి రూ. 2,500, 14-15 కు రూ. 3 వేలు, ఇంటర్మీడియెట్‌కు రూ. 3,500, డిగ్రీలో ఏడాదికి రూ. 4 వేలు, ఇంటర్ పూర్తయిన తర్వాత రూ. 50 వేలు, డిగ్రీ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని 56 మండలాల్లో 7,412 మంది పథకంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 4,475 మందికి మాత్రమే మొదటి ఇన్స్టాల్మెంట్ నగదు బ్యాంకు ఖాతాలో జమైంది.
జిల్లాలోని అన్ని మండలాల ఏపీఎంల వ ద్ద 455, డీపీఎం వద్ద 165 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లబ్ధిదారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, తల్లీబిడ్డల ఫొటోలు, బ్యాంకు అకౌంట్ పుస్తకాలను మండల ఐకేపీ ఏపీఎంలకు అందజేశారు.
- ఏపీజీబీ అకౌంట్ నంబర్ ఇచ్చిన జిల్లాలోని 140 మందికి ఆన్లైన్ సమస్యతో నేటికీ మొదటి విడత నగదు పడలేదు. సెప్టెంబర్‌లో ఏపీజీబీ ఖాతాలో నగదు జమ చేసినట్లు కంప్యూటర్లో పే స్లిప్‌లు తీసిచ్చారు. కానీ బ్యాంకులకు వెళ్లి చూసుకుంటే జమకాలేదు. అప్పటి నుంచి నిత్యం ఐకేపీ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు.
- స్టేట్‌బ్యాంకు, ఆంధ్రాబ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన లబ్ధిదారులకు వెంటనే మొదటి ఇన్స్టాల్మెంట్ మంజూరైంది. 7 నెలల క్రితం నమోదు చేసుకున్న తల్లులు ఇంత వరకు నగదు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 6,526 మంది లబ్ధిదారులు సర్టిఫికెట్లన్నీ అందజేసినా చిన్నపాటి సమస్యలతో 2,051 మందికి సకాలంలో పథకం నగదు అకౌంట్లలో జమకాలేదు. అష్టకష్టాలు పడి అధికారుల చుట్టూ తిరిగి ఐకేపీ అధికారులు కోరిన సర్టిఫికెట్లు అందజేసినా పథకం వర్తించకుండా పోయిందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
పే స్లిప్ వచ్చినా..నగదు పడలేదు
కటికల రూతమ్మ, చింతలపాలెం
2013 జూన్ నెలలో బంగారు తల్లి పథకానికి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏపీజీబీ అకౌంట్ నంబర్ ఇచ్చాను. 2013 నవంబర్ నెలలో రూ. 2500 అకౌంట్లో పడినట్లు పేస్లిప్ ఇచ్చారు. బ్యాంక్‌కు వెళ్లి చూసుకుంటే నగదు జమకాలేదు. రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు.
ఆన్లైన్ సమస్య పరిష్కరిస్తున్నాం..
కృపారావు, డీపీఎం బంగారు తల్లి
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఆన్లైన్ సమస్య ఉండటంతో ఆ బ్యాంకులో అకౌంట్లున్న తల్లులకు నగదు పడలేదు. ఈ మధ్య కాలంలో బ్యాంక్ ఆన్లైన్ కావడంతో సమస్య పరిష్కరిస్తున్నాం. కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఏపీఎంలు ఆన్లైన్లో పలుమార్లు తల్లుల ఏపీజీబీ ఖాతాలను నమోదు చేయడంతో ఆన్లైన్ అవుతున్నాయి. వారం రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది.