బన్నీ మిస్ అయ్యాడుగా..!
అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ జనరేషన్ హీరో. వరుసగా యాబై కోట్ల సినిమాలతో పాటు.. సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్., ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బన్నీ మార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా, బన్నీకి లక్కీ సీజన్‌గా పేరున్న ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించటం లేదు.
అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అయ్యి 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. అయితే దువ్వాడ జగన్నాథమ్ మాత్రం ఆ సమయానికి రిలీజ్ చేయటం కుదిరేలా లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, కాటమరాయుడు సినిమాను మార్చి ఆఖరి వారంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఆ తరువాత రెండు వారాలకు ఏప్రిల్ 14న మహేష్ మురుగదాస్‌ల యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో రెండు వారాలకు రాజమౌళి విజువల వండర్ బాహుబలి 2 థియేటర్లలో సందడి చేయనుంది. వరుసగా భారీ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో బన్నీకి తన సినిమా రిలీజ్ చేసే గ్యాప్ దొరకటం కష్టమే. మరి ఏప్రిల్ సీజన్ మిస్ చేసుకున్న బన్నీ దువ్వాడ జగన్నాథమ్ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి.