arakkonam
-
ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ కుప్పకూలి నలుగురి మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం జరిగింది. అరక్కోణం సమీపంలో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవాల్లో భక్తులపై క్రేన్ కూలడంతో నలుగురు మత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. రాణిపేట జిల్లా నెమిలిలోని కిలివీడి గ్రామంలో ఆదివారం రాత్రి 8.15 గంటలకు ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. మాండియమ్మన్ దేవాలయంలో గత రాత్రి ద్రౌపది అమ్మన్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి 1500 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. నెమిలికి చెందిన 50 మంది పోలీసులు మోహరించారు. సాధారణంగా సంక్రాంతి(పొంగల్) తరువాత ఈ పండుగను జరుపుకుంటారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మైలేరు ఉత్సవాల్లో భాగంగా స్థానిక గ్రామానికి చెందిన వారు క్రేన్‌పై దేవతా విగ్రహాలను ఊరేగించారు. భక్తులు అందిస్తున్న పూలమాలలను అమ్మవారికి అలంకరించేందుకు 25 అడుగుల ఎత్తైన క్రేన్‌పై ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అయితే క్రేన్‌పై బరువు ఎక్కువవడటంతో ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది. క్రేన్‌పై నున్న ముగ్గురు వ్యక్తులు కిందపడి అక్కడిక్కడే మరణించారు. అనూహ్య ఘటనతో ప్రజలు భయాందోళనలతో పరుగలు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలికతో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరక్కోణంలోని ప్రభుత్వ తాలూకా ఆసుపత్రికి, పొన్నైలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. మరోవైపు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు అక్కడ ఓ వ్యక్తి తీసిన ఫోన్లో రికార్డయ్యాయి. ఇందులో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన బాధితులను కే ముత్తుకుమార్(39), ఎస్ భూపాలన్(4), బి జ్యోతి బాబుఉ(17)గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్రేన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. #TamilNadu | 4 people died & 9 others were injured after a #cranecollapsed during a temple festival event in #Keelveethi in #Arakkonam. #BREAKING #craneaccident #arakkonam #Accident #Temple #Death #India | #Crane | #Accident | #Dead | #Injury | #TN | #TempleFestival | pic.twitter.com/iKCjaw7OFV — Harish Deshmukh (@DeshmukhHarish9) January 23, 2023 -
రెండేళ్ల తర్వాత పట్టాలపైకి ‘అరక్కోణం’
రాజంపేట: రెండేళ్ల తర్వాత అరక్కోణం రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు (06401/06402) వచ్చేనెల 27 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. అప్పటి నుంచి పల్లె ప్రయాణికులకు ఒక్క రైలు కూడా లేకుండాపోయింది. ప్రస్తుతానికి ఒక డెమో రైలు ప్రస్తుతం వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో నడుస్తోంది. 8 కార్ మెమూ రేక్తో మెమూ నడవనుంది. కడప వరకు అన్ని పల్లెలో స్టాపింగ్ అరక్కోణం నుంచి కడప వరకు అన్ని పల్లెలో స్టాపింగ్‌తో మెమూ రైలు నడుస్తోంది. అరక్కోణం, తిరుత్తణి, పొనపాడి,వెంకటనరసింహారాజుపేట, నగిరి, ఏకాంబరకుప్పం,వేపగుంట, పుత్తూరు, తడకు, పూడి, రేణిగుంట జంక్షన్ మీదుగా నడుస్తుంది. అక్కడి నుంచి మామండూరు, బాలపల్లె, శెట్టిగుంట, రైల్వేకోడూరు, అనంతరాజంపేట, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, హస్తవరం,నందలూరు, మంటపంపల్లె, ఒంటిమిట్ట, భాకరాపేట, కనుమలోపల్లె కడప వరకు నడుస్తుంది. చార్జీలు ఎక్స్‌ప్రెస్ తరహాలో ఉన్నప్పటికి అన్ని స్టేషన్లలో స్టాపింగ్ సౌకర్యం ఉండటం వల్ల కొంతమేర పల్లెప్రయాణికులకు ఊరట లభించింది. సమయం ఇలా.. మెమూ రైలు రేణిగుంటలో ఉదయం 8.50కి బయలుదేరుతుంది. నందలూరుకు 11 గంటలకు, కడపకు 11.45 గంటలకు చేరుతుంది. తిరుగుప్రయాణంలో సాయంత్రం 3.10 గంటలకు బయలుదేరి, 3.54 గంటలకు నందలూరుకు చేరుకుంటుంది. రైల్వేకోడూరుకు 5.48 గంటలకు, రేణిగుంటకు 5.45 గంటలకు చేరుకుంటుందని రైల్వేబోర్డు తెలి పింది. తమిళనాడు (సదరన్‌రైల్వే) లోని పుత్తూరుకు 6.21 గంటలకు, తిరుత్తిణికి 7గంటలకు, అరక్కోణానికి 7.35 గంటలకు చేరుకుంటుంది. -
త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ముప్పు
అరక్కోణం(తమిళనాడు): గౌహతి- త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ రైలుకు తమిళనాడులోని అరక్కోణం సమీపంలో ప్రమాదం తప్పింది. ఏ1 ఏసీ కోచ్‌లో విద్యుత్ మోటర్లు ఊడిపోవడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మత్తుల అనంతరం ఆరుగంటల ఆలస్యంగా రైలు అక్కడి నుంచి బయల్దేరింది. -
రైలును ఆపి డ్రైవర్ పరార్
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పనిభారాన్ని తట్టుకోలేక కడంబత్తూరు రైల్వేస్టేషన్లో రైలును నిలిపి డ్రైవర్ పరారవడంతో దాదాపు 45 నిమిషాల పాటు రైలు నిలిచిపోరుుంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు కడంబత్తూరు స్టేషన్‌మాస్టర్ రామరాజమీనన్పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. చెన్నై నుంచి అరక్కోణం వరకు నడిచే (నంబర్ 43409) రైలు ఉదయం 10.20 గంటలకు కడంబత్తూరు రైల్వేస్టేషన్‌కు రావాల్సి వుండగా 10.45 గంటలకు చేరింది. రైలును మొదటి ప్లాట్‌ఫాంపై నిలిపిన డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు 25 నిమిషాల పాటు రైలు కదలకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఇంజిన్ వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయి ఉండడంతో ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ గది వద్దకు వెళ్లారు. దాదాపు అరగంట దాటుతున్నా రైలు ఎందుకు బయలుదేరడం లేదని వారు ప్రశ్నించారు. ఇందుకు స్టేషన్ మాస్టర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు, స్టేషన్ మాస్టర్ రామరాజమీనన్ తో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌పై దాడికి యత్నించారు. ఈ తతంగాన్ని తిరువళ్లూరు, అరక్కోణం ప్రాంతాలకు వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎల్ఆర్ఎస్(లీవ్ రిజర్వ్డ్ సర్వీసు)లో ఉన్న డ్రైవర్‌ను అరక్కోణం నుంచి వస్తున్న లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా పిలిపించి సర్దుబాటు చేశారు. దీంతో అరక్కోణం నుంచి వచ్చిన డ్రైవర్‌తో దాదాపు 45 నిమిషాల తరువాత రైలును ముందుకు నడిపించారు. పని ఒత్తిడే కారణమా? కడంబత్తూరు రైల్వేస్టేషన్లో రైలును నిలిపి వేసి డ్రైవర్ ఇంటికి వెళ్లిపోవడానికి పని ఒత్తిడే కారణమని తెలుస్తుంది. బుధవారం డ్యూటీలోకి చేరిన డ్రైవర్‌ను గురువారం ఉదయం లోపు రిలీవ్ చేయాల్సి ఉంది. అయితే గురువారం ఉదయం చెన్నై వరకు వె ళ్లిన డ్రైవర్ తిరువళ్లూరుకు చేరుకున్న తరువాత తనను డ్యూటీ మార్చాలని కోరారు. అయితే అప్పుడు రావాల్సిన డ్రైవర్ రాకపోవడంతో రైలు కడంబత్తూరు వరకు నడపాలని, అక్కడే ఉన్న డ్రైవర్ రిలీవ్ చేస్తారని సర్దిచెప్పి పంపిం చారు. అయితే కడంబత్తూరుకు చేరుకున్నాక కూడా డ్రైవర్‌ను రిలీవ్ చేసే వారు లేకపోవడంతో ఆగ్రహించిన డ్రైవర్ రైలును కడంబత్తూరులో నిలిపివేసి ఇంటికి వెళ్లిపోయారని రైల్వేలో పని చేస్తున్న అధికారి వెల్లడించారు.