చిన్నారిపై ప్రైవేటు ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు
కీచకుడిపై నిర్భయ కేసు నమోదు
వైరా : ఆరేళ్ల బాలికపై ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పాఠశాలలో కొణిజర్ల మండలం కొత్తకాసారం గ్రామానికి చెందిన తేళ్లూరి విజయ్‌కుమార్ రెండేళ్ల నుంచి ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20న అదే పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వరుసగా రెండు రోజులపాటు తరగతి గదిలోనే చివరి బెంచీలో కూర్చోమని చెప్పి వేధించ సాగాడు. కాగా.. చిన్నారి నాన్నమ్మకు విషయాన్ని చెప్పి.. ఆ పాఠశాలకు వెళ్లనని.. తనను మరో పాఠశాలలో చేర్పించమంటూ ఆందోళన చెందుతూ చెప్పింది. ఆ సమయంలో తండ్రి ఇంట్లో లేకపోవడం.. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఆందోళనకు గురైంది. మంగళవారం పాఠశాలకు వెళ్లి విషయాన్ని యాజమాన్యానికి చెప్పడంతో.. వారు సదరు ఉపాధ్యాయుడిని మందలించి.. పాఠశాల నుంచి వెళ్లగొట్టారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. సీఐ చేరాలు.. ఏఎస్సై ఖాజాను పాఠశాలకు పంపించి వివరాలు సేకరించారు. విజయ్‌కుమార్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై కరస్పాండెంట్‌ను వివరణ కోరగా.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, కీచక ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు.