సెప్టెంబర్ నుంచి ఉచిత వైఫై
కేకేనగర్: పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత వైఫై పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఎన్నికల వాగ్ధానాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ సంస్థ ఇందుకోసం ఏర్పాట్లు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఉచిత వైఫై సౌకర్యానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ మొదటి విడతగా 32 జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడానికి నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండు, పార్కులు, ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం ఏజెంట్ల ద్వారా టెండర్లను కోరినట్లు దీనికి ఉపకరణాలు, సర్వర్, డేటా వంటివి అందజేసే ఏజెన్సీలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి లభించే ఆదరణ బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తామని అధికారులు తెలిపారు.